మార్చి అన్నారు.. మర్చిపోయారు | - | Sakshi
Sakshi News home page

మార్చి అన్నారు.. మర్చిపోయారు

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన ఆయుష్‌ సెంటర్ల నిర్మాణం

జిల్లాలో 13 భవనాల్లో 9 పూర్తి

నాలుగు కేంద్రాల్లో పనులు పెండింగ్‌

ప్రొద్దుటూరు క్రైం : కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఆయుష్‌ సెంటర్ల భవనాల పనులు అధికారుల పర్యవేక్షణలోపం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యానికి గురవుతున్నాయి. రాయలసీమలో 41 ఆయుష్‌ సెంటర్ల నిర్మాణం చేపట్టగా, కడప జిల్లాలో 13 భవనాలకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటివరకు 9 భవనాల నిర్మాణం పూర్తయింది. అయితే ప్రొద్దుటూరు, పుల్లంపేట, చిలంకూరు, కందిమల్లాయపల్లె ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న నాలుగు భవనాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పూర్తి కాని పనులు

సుమారు రూ. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్‌ సెంటర్లను నిర్మిస్తున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఆయుష్‌ సెంటర్‌ కోసం స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మార్చి నెలాఖరకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే జూలై వచ్చినా ఇంత వరకు పనులు పూర్తి చేయలేదు. నత్తనడకన సాగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పోటా పోటీగా బీజేపీ నాయకుల ప్రచారం

రాష్ట్రంలో 150 ఆయుష్‌ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటి నిర్మాణం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం వీటి గురించి పెద్దగా ప్రచారం చేసుకుంటోంది. ఇక ప్రొద్దుటూరులో అయితే టీడీపీ, బీజేపీ నాయకులు ప్రచారం చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ స్వస్థలం. దీంతో ఆయుష్‌ సెంటర్‌ మంత్రి చొరవతోనే మంజూరైందని బీజేపీ నాయకులు చెప్పుకుంటుండగా.. టీడీపీ నాయకులు మాత్రం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కృషితో ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెబుతున్నారు. వారి ప్రచార ఆర్భాటం, వ్యక్తిగత గొప్పలు ఆయుష్‌ సెంటర్‌ భూమిపూజ రోజున తేటతెల్లమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటి సభ్యుడు, ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్‌ చొరవతోనే ఆయుష్‌ సెంటర్‌, యునాని మెడికల్‌ కాలేజీ ప్రొద్దుటూరుకు మంజూరైందని చెప్పగా.. టీడీపీ నాయకుడు బద్వేలి శ్రీనివాసులరెడ్డి, తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కృషి వల్ల ఆయుష్‌ సెంటర్‌, యునాని మెడికల్‌ కాలేజీ మంజూరు అయినట్లు చెప్పారు. సొంత ప్రచారం కోసం, పేరు కోసం ప్రాకులాడే ఇరుపార్టీల నాయకులు ఆయుష్‌ భవన నిర్మాణ విషయంలో కొంత మేర శ్రద్ధ తీసుకొని వుంటే ఈ పాటికి పూర్తయ్యేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

అగ్గిపెట్టె సైజులో ఉందంటూ

అధికారుల పెదవి విరుపు

ఇక్కడ 1042 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ సెంటర్‌ అగ్గిపెట్టె సైజులో ఉన్నట్లు ఆ శాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో నిర్మాణమైన భవనంలో మూడు విభాగాలను ఎలా నిర్వహించాలని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యునాని, ఆయుర్వేద విభాగాలకు పెద్ద మొత్తంలో మందులు వస్తుంటాయని, మందుల స్టాకు వచ్చినప్పుడు ఇరుకై న ఫార్మసీ గదిలో వాటిని నిల్వ చేయడం కష్టమంటున్నారు. భవిష్యత్తులో మందుల నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆయుష్‌సెంటర్‌లో హోమియో, యునాని, ఆ యుర్వేం ఓపీ కన్సల్టెంట్‌ విభాగాలు, ఒక ఫార్మసీ, పేసెంట్లు వేచి ఉండటానికి హాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఒకే సెంటర్‌లో 3 విభాగాల వైద్యం కోసం వచ్చే ప్రజలతో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనం సరిపోదని ప్రజలు చెబుతున్నారు. కాగా ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిసి పనులు పూర్తి కాకున్నా కాంట్రాక్టర్‌ పెయింట్‌ వేశారు. ఈ విషయంపై ఆయుష్‌ రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ నాగమునినాయక్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆయుష్‌ సెంటర్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇటీవల కమిషనర్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి పనుల జాప్యంపై ఈఈ, ఇతర అధికారులకు క్లాస్‌ పీకారు. రాయలసీమ వ్యాప్తంగా మంజూరైన 41 సెంటర్లలో అన్ని ప్రాంతాల్లో పూర్తి కాగా కడప జిల్లాలో 4 చోట్ల పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement