కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా | - | Sakshi
Sakshi News home page

కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Jul 6 2026 1:58 AM | Updated on Jul 6 2026 1:58 AM

ప్రొద్దుటూరు క్రైం : తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ ఓ వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన ప్రొద్దుటూరులోని మక్కా మసీదు వీధిలో ఆదివారం జరిగింది. ప్రొద్దుటూరులోని డీసీఎస్సార్‌ కాలనీకి చెందిన ఆదిల్లాకు ఐదేళ్ల క్రితం ఆర్ట్స్‌కాలేజీ రోడ్డులోని మక్కా మసీదు వీధికి చెందిన షారూఖ్‌ హుస్సేన్‌తో వివాహమైంది. ఆ సమయంలో 25 తులాల బంగారు, 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. ప్రస్తుతం వారికి రెండేళ్ల కుమార్తె సైజా ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది క్రితం భర్త షారూక్‌హుస్సేన్‌ భార్య ఆదిల్లాను పుట్టింట్లో వదలాడు. అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నట్లు బాధిత మహిళ తెలిపింది. ఊళ్లో ఉన్నాడో లేడో కూడా తెలియదని ఆమె అంటోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. తన అత్త సాహిల్‌బాను వల్లనే తన భర్తతో విభేదాలు వచ్చినట్లు ఆదిల్లా ఆరోపిస్తోంది. బంధువులు చెప్పినా అత్త, భర్త వినిపించుకోలేదని ఆమె అంటోంది. ఇంటి వద్ద ధర్నా చేస్తున్న సమయంలో కుమార్తె తండ్రి కోసం గేట్‌ తట్టడం అందరినీ కలచివేసింది. వన్‌టౌన్‌ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. ఏదైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఐ సూచనతో ఆదిల్లా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement