ఓటర్ల గుండె ఘోష
శ్రీకడప నగరంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంపై సామాన్య ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రినగర్‌కు చెందిన సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఈ ఎన్యుమరేషన్ పత్రాలు ఎలా భర్తీ చేయాలో చదువుకున్న వారికి సైతం అర్థం కావడం లేదని, ఫారాలలో తప్పులు రాస్తుంటే బీఎల్‌ఓలు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం గడువు పొడిగిస్తే తప్ప జాబితా సక్రమంగా ఉండదన్నారు. అదే ప్రాంతానికి చెందిన వల్లూరు నారాయణమ్మ మాట్లాడుతూ.. తమ డివిజన్‌లో 2002 నాటికి ఓటు లేనివారు చాలామంది ఉన్నారని, ఇప్పుడు వారి తల్లిదండ్రుల ఓటు ఎక్కడుందో తెలియక వేలాది మంది అవస్థలు పడుతున్నందున గడువు పెంచాలని డిమాండ్ చేశారు. సున్నపుబట్టీల వీధికి చెందిన బేల్దారి కూలి మబ్బు సుశీల ఆవేదన వెళ్లగక్కుతూ.. శ్రీనాకు చదువు రాదు, ఆరోగ్యం బాలేదు. ఫారాలు భర్తీ చేయడం తెలియక అధికారుల వద్దకు పోతే.. ఫోన్ నంబర్లు, డోర్ నంబర్లతో పాటు 2002 నాటి ఓటు వివరాలు తేవాలంటున్నారు, ఈ బాధలు మేము పడలేం్ఙ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అక్కాయపల్లెకు చెందిన అద్దెదారు గంగాధర్ మాట్లాడుతూ.. బాడుగ ఇళ్లలో ఉంటూ తరచూ ఇళ్లు మారే తాము పాత నంబర్లు ఎక్కడి నుంచి తేవాలని, ఈ సాకుతో ఎక్కడ తమ ఓటు హక్కును తొలగిస్తారోనని భయపడుతున్నామన్నారు.
కడప సెవెన్‌రోడ్స్:ఓటు హక్కు నమోదు, సవరణల కోసం నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ క్షేత్రస్థాయిలో ప్రహసనంగా మారింది. శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించినప్పటికీ..కిందిస్థాయి యంత్రాంగం వాటిని పూర్తిగా బేఖాతరు చేసింది. పనీపాట వదిలేసి, రోజుమొత్తం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఓటు నమోదు కాకపోవడంతో, శ్రీఈ ఓటు లేకున్నా మానె.. ఈ బాధలు పడలేము సర్!్ఙ అంటూ కడప నగరవాసులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.
పత్తాలేని సిబ్బంది..
మరియాపురం, కాగితాలపెంట పరిసర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు, సహాయక సిబ్బంది సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ బాలుర తెలుగు మీడియం హైస్కూలులో 15, 16 నెంబర్ల పోలింగ్ కేంద్రాల కోసం షామియానా వేసినా.. రెండు రోజులుగా ఒక్క అధికారీ రాలేదు. పక్కనే ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీషు మీడియం హైస్కూలులోని 27, 28, 29, 30, 31 నెంబర్ల కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్ ఆనవాళ్లే లేవు. మరియాపురంలోని బాలికల ఎలిమెంటరీ స్కూలు, హైస్కూల్‌లోని 17, 23, 24, 25, 26, 53 కేంద్రాలు మరియు కాగితాలపెంట ఉర్దూ పాఠశాల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
అద్దె ఇళ్ల ఓటర్లకు 2002 నిబంధనల శాపం!
ఇంటింటికీ ఎన్యుమరేషన్ పత్రాలైతే అందాయి కానీ, వాటిని ఎలా నింపాలో తెలియక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుదారులు తెలియక తప్పులు చేస్తుంటే చెప్పే నాథుడు లేడు, తీరా వాటిని బీఎల్‌ఓల వద్దకు తీసుకెళ్తే తిరస్కరిస్తున్నారు. సిటిజన్ సర్వీసు పోర్టల్ తెలియక నిరుపేదలు నెట్ సెంటర్లలో డబ్బులు వృథా చేసుకుంటున్నారు. దీనికి తోడు, ఏకంగా పాతికేళ్ల క్రితం నాటి, అంటే 2002 నాటి ఇంటి నంబర్లు, ఓటరు స్లిప్పులను తేవాలంటూ బీఎల్‌ఓలు కొర్రీలు పెడుతున్నారు. బతుకుదెరువు కోసం ఏటా ఇళ్లు మారే తాము, ఆ పాతికేళ్ల క్రితం నాటి పాత స్లిప్పులను ఎక్కడి నుంచి తీసుకురావాలని అద్దె ఇళ్ల నిరుపేద కుటుంబాలు అధికారులను నిలదీస్తున్నాయి.
జాడలేని సహాయ కేంద్రాలు
ఎన్యుమరేషన్ పత్రాలను పూరించడం, 2002 జాబితాను పరిశీలించడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కంటికి కనిపించలేదు. సహాయ కేంద్రాల వద్ద ఉండాల్సిన ఆర్పీలు, ఆశా వర్కర్లకు అసలు ఫారాల భర్తీ, డిజిటైజేషన్‌పై కనీస అవగాహన లేదు. పలుచోట్ల రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఓటర్లకు సహకరించడం లేదు.ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూలై 14వ తేదీ నాటికి ఓటర్ల వివరాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు రోజూ ఒత్తిడి తెస్తున్నా.. సహాయక సిబ్బంది రాకపోవడంతో దరఖాస్తులు తీసుకోవడం నుంచి డిజిటైజ్ చేయడం వరకు అన్నీ తామే ఒంటరిగా చేసుకోవాల్సి వస్తోందని, గడువులోపు లక్ష్యాలు పూర్తయ్యే అవకాశమే లేదని స్వయంగా బీఎల్‌ఓలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులను గాలికొదిలేసిన క్షేత్రస్థాయి అధికారులపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోకపోతే, కడప నగరంలో వేలాది మంది నిరుపేదలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచివుంది.
గంగాధర్
టైగర్ కారిడార్..
నిమ్మకు నీరెత్తినట్లున్న అధికారులు
స్పెషల్ క్యాంపెయిన్‌లో ‘బీఎల్‌ఓ’ల సామూహిక డుమ్మా
పాతికేళ్ల క్రితం నాటి డాక్యుమెంట్ల కోసం అద్దెదారులపై కొర్రీలు
కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు
‘హెల్ప్‌డెస్క్’లు వట్టి మాటేనా?


