రాజంపేట : రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణలో అత్యంత కీలకమైన ’టైగర్ కారిడార్’ ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. రాజంపేట పరిధిలోని కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల సంచారం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, అటవీశాఖ ఈ బృహత్తర ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం నుంచి తిరుపతి శేషాచలం అడవుల వరకు పులుల సురక్షిత రాకపోకల కోసం ప్రతిపాదించిన ఈ టైగర్ కారిడార్ ప్రాజెక్టు తుది నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కావడంతో, దీనికి సంబంధించిన నిధులు, తదుపరి అటవీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రమే చేపట్టనుంది.
నాలుగు జిల్లాల పరిధిలో..
1500 చదరపు కిలోమీటర్లు!
ఈ ప్రతిపాదిత దక్షిణ కారిడార్ మార్గం దాదాపు నాలుగు జిల్లాల పరిధిలో 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని అనుసంధానించనుంది. వైఎస్సార్ కడప, నంద్యాల, తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దులు ఇందులో భాగం కానున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు రేంజ్‌లో పులుల సంచారం ఇప్పటికే అధికారికంగా నమోదు కాగా, అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని రాపూరు, వెంకటగిరి రేంజ్‌లు మరియు తిరుపతి శేషాచలం అడవుల వైపు పులులు సురక్షితంగా వెళ్లేందుకు ఈ ‘దక్షిణ కారిడార్ మార్గం’ అత్యంత కీలకంగా మారనుంది.
పులుల ఆవాసానికి కేరాఫ్..
లంకమల్లేశ్వర అభయారణ్యం!
వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పులుల శాశ్వత ఆవాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ అభయారణ్యం పరిధిలోని బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాలు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి రేంజ్‌లతో సరిహద్దులను పంచుకుంటూ ఆనుకొని ఉన్నాయి. భౌగోళికంగా, జీవవైవిధ్య పరంగా ఎంతో అనుకూలమైన ఈ రూట్‌ను టైగర్ కారిడార్‌కు ప్రధాన హృదయభాగంగా భావిస్తున్నారు.
వెలిగొండ అడవుల్లో
జంట పులుల కదలికలపై కన్ను!
నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి ఇప్పుడు జిల్లా సరిహద్దు వైపు విస్తరిస్తున్నాయి. నెల్లూరు–కడప సరిహద్దుల్లోని వెలిగొండ అటవీ ప్రాంతంలో.. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఒక ఆడపులి, ఒక మగపులి (జంట పులులు) సంచరిస్తున్నట్లు అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో లంకమల్లేశ్వర క్షేత్రంతో పాటు సరిహద్దు అడవుల్లో అత్యాధునిక సీసీ కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసి పులుల కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నారు.
డిసెంబరులో మళ్లీ పులుల గణన
గత ఏడాది సరిహద్దు అటవీ ప్రాంతాల్లో అధికారులు పులుల గణన చేపట్టినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కచ్చితమైన లెక్కలు తేలలేదు. ఈ నేపథ్యంలో రాబోయే డిసెంబరు నెలలో అత్యంత శాసీ్త్రయ పద్ధతిలో మళ్లీ పులుల గణన చేపట్టేందుకు అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. కెమెరా ట్రాప్‌ల ద్వారా లభించే నాణ్యమైన డేటా ఆధారంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో పులుల కచ్చితమైన సంఖ్యను, వాటి వలస మార్గాలను అధికారికంగా రికార్డు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రాయలసీమ, నెల్లూరు అటవీ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి.


