● 2018లో శంకుస్థాపన చేసిన
కంబాలదిన్నె వద్ద ఎందుకు
ప్రారంభించలేదు
● చంద్రబాబు క్రెడిట్ చోరీ
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం కక్షసాధింపు వల్లే రెండేళ్లపాటు స్టీల్‌ప్లాంటు పనులు ఆగిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత తన ప్యాకేజీ కోసం కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ, స్టీల్ ప్లాంటును తాకట్టు పెట్టింది చంద్రబాబేనని తూర్పారబట్టారు. 2018లో ఎన్నికల స్టంట్‌లో భాగంగానే కంబాలదిన్నె వద్ద స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప సంకల్పంతో స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ చేశారన్నారు. భూసేకరణ, నీటి కేటాయింపులు, విద్యుత్, అంతర్గత రోడ్లు, పర్యావరణ అనుమతులు, సీఎఫ్‌ఈ వంటి వాటి కోసం రూ.700 కోట్లు ఖర్చు చేశారన్నారు. జేఎస్‌డబ్ల్యూ వంటి దేశంలోనే అతిపెద్ద సంస్థను కడపకు తీసుకొచ్చారన్నారు. దీన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవ డం సిగ్గుచేటన్నారు. ఇది క్రెడిట్ చోరీ కాదా...చరిత్రను వక్రీకరించే ప్రయత్నం కాదా అని ధ్వజమెత్తారు. అన్ని అనుమతులు, మౌళిక వసతులు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగానే రెండేళ్లు ఆపిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే రెండేళ్లలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి మాట నిలుపుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, బసవరాజు, తోటక్రిష్ణ, కంచుపాటి బాబు పాల్గొన్నారు.


