కాశినాయన: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఇంటింటి సర్వే ప్రక్రియ మహిళా ఓటర్లను, ముఖ్యంగా మెట్టింటికి వచ్చిన కోడళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 2002 తర్వాత వివాహమై అత్తగారిళ్లకు వచ్చిన కోడళ్ల ఓట్ల నమోదుపై సరికొత్త నిబంధనలు ముంచుకురావడంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
పుట్టింటి ఆధారాలు తప్పనిసరి
జిల్లాలో మొత్తం 20,56,660 మంది ఓటర్లు ఉండగా, వారిలో దాదాపు 50 శాతం మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఈ మహిళల్లో కనీసం 40 శాతం మంది పెళ్లిళ్లు చేసుకుని అత్తవారి ఇళ్లకు వచ్చిన కోడళ్లేనని అధికారుల అంచనా. ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా వీరంతా తమ ఓట్లను మ్యాపింగ్ చేసుకోవా ల్సి ఉంటుంది. అయితే, మెట్టినింటికి వచ్చి న మహిళలు ఓటర్ల జాబితాలో కొనసాగా లంటే పుట్టింటి ఆధారాలు చూపించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చినప్పు డు కోడళ్ల వివరాలు అడుగుతూ.. వివాహానికి ముందు వారి స్వగ్రామంలో తల్లిదండ్రు ల ఓట్లకు సంబంధించిన ఓటరు లిస్టులోని వివరాలను లేదా పుట్టింటి పాత ఐడీ కార్డులను తీసుకొస్తేనే ఇక్కడ ఉన్న మహిళల ఓట్లకు మ్యాపింగ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా కాపురం ఉంటూ అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేసిన మహిళలను.. ఇప్పుడు పుట్టింటి ఆధారాలు అడుగుతుండటంతో, పాత రికార్డులు లభించక వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గిరిజన ఓటర్లకే పెద్ద దెబ్బ
ఈ కఠిన నిబంధనల వల్ల వెనుకబడిన వర్గాలతో పాటు ముఖ్యంగా గిరిజన ఓటర్లకు భారీ గండిపడే ప్రమాదం పొంచి ఉంది. గిరిజన ఓటర్లు ఎక్కువ శాతం మంది ఒకే చోట స్థిరంగా నివాసం ఉండే అవకాశం లేదు. పొట్టకూటి కోసం, జీవనోపాధి కోసం వారు తరచూ రాష్ట్రాలు, జిల్లాలు, ఊర్లు మారు తూ వలస వెళ్తుంటారు. దీనికి తోడు గిరిజ నుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులై ఉంటారు. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల (వలసలు, చదువు లేకపోవడం) వారు దశాబ్దాల నాటి పుట్టింటి పాత రికార్డులను భద్రపరుచుకోలేకపోయారు. ఫలితంగా, గిరిజన మహిళల ఓట్లు మ్యాపింగ్‌కు నోచుకునే అవకాశం ఉండకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


