● ‘తాళి’ తెంచే లాభం తనకొద్దంటున్న చిరు వ్యాపారి
● గల్లా పెట్టె నిండకపోయినా పర్లేదు..
తోటి మానవుల ఆరోగ్యమే ముఖ్యం
● తన అంగట్లో బీడీలు, సిగరెట్లు,
గుట్కాల అమ్మకాలను
పూర్తిగా నిషేధించిన ఖాదర్ బాషా
వ్యాపారం అంటేనే లాభనష్టాల బేరీజు. రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయల లాభం ఎక్కడ వస్తుందా అని వెతుక్కోవడం. అందుకే వ్యాపారం ద్రోహచింతన అనే నానుడి ప్రజల్లో నాటుకుపోయింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కిరాణా కొట్టు, బడ్డీ కొట్టు నడిపేవారి రోజువారీ సంపాదన పెరగాలంటే బీడీలు, సిగరెట్లు, గుట్కాల అమ్మకాలే ప్రధాన ఆధారం. వాటిలో వచ్చే లాభం అంతా ఇంతా కాదు. కానీ, చక్రాయపేటకు చెందిన చిరు వ్యాపారి ఖాదర్ బాష మాత్రం వీటికి పూర్తిగా భిన్నం. వ్యాపారం అంటే కేవలం సమాజానికి ద్రోహం చేయడం, నలుగురిని రోగాల పాలు చేయడం కాదని ఆయన నిరూపించారు. గత ఎనిమిది నెలలుగా ఆయన తన అంగట్లో వీటికి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు.్ఙఎందుకయ్యా.. మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని వదులుకున్నావు?్ఙ అని అడిగితే, ఆయన చెప్పిన సమాధానం వింటే ఎవరికై నా గుండె కరుగక మానదు. ‘లాభం వస్తుంది నిజమే సార్.. కానీ దాంతో పాటు పాపం కూడా వస్తుంది కదా!’ అంటాడు ఖాదర్ బాష నిష్కల్మషమైన నవ్వుతో. ‘మన దగ్గరకు వచ్చి బీడీలు, సిగరెట్లు, గుట్కాలు కొనుక్కుపోతారు. వాటి ద్వారా ఆరోగ్యాలు పాడవుతాయి, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. రేపు పొద్దున వాటితో ఆ కుటుంబ యజమాని చనిపోతే వాల్ల భార్యాబిడ్డలు అనాథలు అవుతారు. వారికి దిక్కెవరు? ఆ పాపం అంతా మనల్ని చుట్టుకోదా? అందుకే ఆ డబ్బు నాకొద్దు అనుకున్నా. దేవుడు కూడా మనం మంచిగ ఉంటే మంచే చేస్తాడు. అందరూ బాగుండాలని నేను అల్లాను ప్రార్థన చేస్తా’ అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు.సమాజంలో నైతిక విలువలు కరువైపోతున్న ఈ రోజుల్లో, కేవలం తోటి మానవుల క్షేమం కోసం తన లాభాలను త్యాగం చేసిన ఖాదర్ బాష నిజంగా అభినందనీయుడు. ‘వ్యాపారంలో మానవత్వం’ అంటే ఇదేనేమో!
– మురళీధర్, చక్రాయపేట.


