● నేటితో ముగియనున్న కాల పరిమితి
● ఉద్యోగుల్లో ఆందోళన
● ఇదీ వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్య శాఖ (జోన్ –4) ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఉద్యోగులకు ఈ నెల 5వ తేదీ నాటికి పదోన్నతులు చేపట్టడానికి గడువు ముగియనుంది. దీంతో రాయలసీమ జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ‘ప్రమోషన్ టెన్షన్’పట్టుకుంది. ఫలితంగా కడప ప్రాంతీయ కార్యాలయంలో.. అర్హులు, ఆశావహులైన ఉద్యోగులతో సందడిగా మారింది.
కొనసాగుతున్న జోన్‌ల విభజన ప్రక్రియ
ఈ శాఖ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల పదోన్నతుల క్యాలెండర్‌కు సంబంధించి ఏటా సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కారణంగా జోన్‌ల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా పదోన్నతుల క్యాలెండర్ ఒక నెల ముందుగానే ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ లోపల పదోన్నతుల ప్రక్రియను ముగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఇటు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగులు.. అటు ప్రమోషన్‌కు అర్హులైన ఉద్యోగులతోపాటు ఆశావహులైన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఫలితంగా డాక్టర్ రామగిడ్డయ్య రీజనల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే శర వేగంగా కొన్ని క్యాడర్ల ప్రమోషన్లు జరిగాయి. ఏఎన్‌ఎం నుంచి స్టాఫ్‌నర్స్‌గా జరగాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయి. అలాగే మరికొన్ని ప్రమోషన్‌లు కూడా అయిపోయాయి. ఈ తరుణంలో డాక్టర్ రామగిడ్డయ్య జూన్ 30వ తేదీన పదవీ విరమణ చెందారు. అనంతరం రీజినల్ డైరెక్టర్‌గా ఈ నెల రెండవ తేదీన డాక్టర్ గీతాబాయి బాధ్యతలు చేపట్టారు. అధికారుల ఆదేశం ప్రకారం యథావిధిగా పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈనెల 3వ తేదీ 267 మందికి ఏఎన్‌ఎం నుంచి (జీఎన్‌ఎంగా ట్రైనింగ్ చేసిన వారికి) స్టాఫ్ నర్స్‌గా పదోన్నతులు కల్పించారు. మొత్తం 267 మందిలో 80 మందికి పైగా పదోన్నతులు పొందారు. వారంతా ప్రధాన ప్రాంతాలైన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో విధులను చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని కేడర్లకు కూడా పదోన్నతులు జరిగాయి.
కొనసాగింపుపై ఊహాగానాలు
ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగులు గడువులోపు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందున అనుమతుల కోసం విజయవాడకు వెళ్లి రావడానికి ఆలస్యం కానుంది. అందువల్ల ఈ– ఆఫీస్ ద్వారా పదోన్నతులకు అనుమతులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి అనుమతులు రాగానే మరి కొన్ని కేడర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. కాగా పదోన్నతులకు గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రమోషన్‌కు గడువు పొడిగిస్తారనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. జోన్‌ల విభజన జరుగుతున్న నేపథ్యంలో, ప్రమోషన్‌కు కాలయాపన జరిగితే, మళ్లీ పదోన్నతి పొందడానికి ఆలస్యం అవుతుందని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ జోన్ –4 పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో పదోన్నతుల ‘గడువు గండం’ పట్టుకుంది.


