జిల్లా అభివృద్ధిపై కూటమి వివక్ష | - | Sakshi
Sakshi News home page

జిల్లా అభివృద్ధిపై కూటమి వివక్ష

Jul 5 2026 3:00 AM | Updated on Jul 5 2026 3:00 AM

నాటి సీఎం వైఎస్సార్‌ తర్వాత

జగన్‌తోనే ప్రగతి

‘జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం’

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

కడప రూరల్‌ : ‘జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు. దీంతో జిల్లా వెనుకబడి ఉంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా, ప్రగతి మాత్రం కనిపించడం లేదు. నికర జలాలు.. పరిశ్రమల సాధన, రాజకీయ చైతన్యంతో అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని వక్తలు తెలిపారు. శనివారం స్థానిక బీసీ భవన్‌లో పట్టుపోగుల పవన్‌ కుమార్‌ అధ్యక్షతన ‘జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం, జిల్లా ఇప్పటికీ వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉంది, కారణాలు ఏమిటి’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ అభివృద్ధి అంటే సామాన్యుడి ఆదాయం పెంచే విధంగా ఉండాలన్నారు. ఖనిజాలతో విలువైన జిల్లాగా మారిన కడపపై వివక్ష రాజకీయాలు సాగడం దురదృష్టకరమని తెలిపారు. కడప ఉమ్మడి జిల్లాకు లక్ష కోట్లు కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కారణంగానే జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నుంచి పేదరికాన్ని రూపుమాపుతామని చెబుతూనే వస్తున్నారని, కానీ ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలపతి, సంగటి మనోహర్‌, చంద్రమౌళి, ఓబులేశు యాదవ్‌, సీఆర్వీ ప్రసాద్‌, అంజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement