బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయనగర్‌లో గల ఎఫ్‌సి షాపు నంబర్ 7లో శనివారం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయనగర్‌లోని రేషన్ దుకాణంలో రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ శివశంకర్ తనిఖీలు నిర్వహించారు. 2629 కిలోల బియ్యం, 365 కిలోల జొన్నలు ఎక్కువగా ఉండటంతోపాటు 43.50 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. సరుకులను వీఆర్‌ఓకు అప్పగించి రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు.
అగ్ని ప్రమాదం–
రూ.2 లక్షల నష్టం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో బొగ్గులు కాల్చేందుకు సిద్ధంగా ఉన్న కట్టెలు శనివారం అగ్నికి ఆహుతయ్యాయి. జమ్మలమడుగు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖరప్ప వివరాల మేరకు.. లావనూరు గ్రామంలో ఓ బొగ్గుల బట్టి వద్ద నిల్వ ఉన్న కట్టెలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో జమ్మలమడుగు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటన స్థలాన్ని వచ్చి మంటలను అదుపు చేశారు. బాధితుడికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
చాపాడు : ప్రొద్దుటూరు – మైదుకూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో గల పెట్రోలు బంకు ఎదురుగా శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు వైపు బైకుపై వెళుతున్న దినేష్ అనే యువకుడు రోడ్డు దాటుతున్న బైక్‌ను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన దినేష్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


