అప్పోసప్పో తెచ్చిన పెట్టుబడులు నేలపాలు
● ఆకాశం వైపు రైతన్న చూపులు ● కారుమబ్బుల కవ్వింపు.. ఎండల ఉడికింపు
కడప అగ్రికల్చర్: పంటకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా జిల్లాలో వరుణుడి కరుణ లభించకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. జూన్ నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదు కావడం సాగును దెబ్బతీసింది. ఆకాశంలో రోజురోజుకూ మబ్బులు కమ్ముకొస్తున్నా, అరకొర చినుకులు రాలడమే తప్ప పూర్తిస్థాయిలో వర్షం కురవడం లేదు. ఒకపక్క ఎండలు, మరోపక్క మబ్బులతో కూడిన ఈ విభిన్న వాతావరణం రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాగు పనులు ముందుకు సాగక, అప్పటికే విత్తిన పంటలు కళ్లముందే ఎండిపోతాయేమోననే ఆందోళనలో రైతాంగం మల్లగుల్లాలు పడుతోంది.
సమయం ముంచుకొస్తోంది..
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగ సాగుకు సమయం అత్యంత వేగంగా ముంచుకొస్తోంది. సాంకేతికంగా జులై 15వ తేదీతో వేరుశనగ పంట సాగు గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో మొత్తం 4,446 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా.. నెల రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం 766 హెక్టార్లలోనే విత్తనాలు పడ్డాయి. అంటే ఇంకా ఏకంగా 3,680 హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. ఈ పక్షం రోజుల్లో అనుకున్న మేర వర్షం కురిస్తే కొంతమేర సాగవుతుంది, లేకుంటే ఈ ఏడాది వేరుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది.
22 శాతం వర్షపాత లోటు
ఇప్పటి వరకు జిల్లాలో వర్షాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అధికారిక గణాంకాల ప్రకారం జూన్ నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 68.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 49.8 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈ భారీ వర్షపాత లోటు కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు అసలు విత్తనం విత్తాలా వద్దా? విత్తితే రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
బోర్ల కింద సాగు చేసినా తప్పని సెగ
బోర్ల కింద సాగు చేసిన రైతులకూ తప్పని సెగ
వర్షాలు లేక వర్షాధార రైతులు అల్లాడుతుంటే, మరోవైపు బోరుబావుల కింద సాగు నమ్ముకున్న రైతాంగంలోనూ వణుకు మొదలైంది. వర్షాలు పడకుండా ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయి, బోర్లలో నీరు అడుగంటిపో తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్.. మేఘాల కవ్వింపు చర్యలు
ఈ సారి ‘ఎల్‌నినో’ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం ఇపుడు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నపళంగా కారుమేఘాలు కమ్మేయడం, భారీగా వాన పడుతుందని ఆశపడేలోపే ఆ మేఘం కాస్తా తేలిపోవడం నిత్యకృత్యమైంది. లేదంటే తుంపరలా వచ్చి అలా కవ్వించి వెళుతోంది. పడితే ఒకే చోట వర్షం కురవడం, పడని చోట అసలు చినుకు కూడా రాలని విచిత్ర పరిస్థితి నెలకొంది.
ఖరీఫ్ సాగుపై అనావృష్టి దెబ్బ..
జూన్ ముగిసేనాటికి నమోదైన వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాలే జిల్లాలోని సాగు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో మొత్తం 76,496 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 7,552 హెక్టార్లలోనే (సుమారు 10 శాతం) సాగు కావడం గమనార్హం. వేరుశనగ సాగు విస్తీర్ణం 4,446 హెక్టార్లు లక్ష్యం అయితే 766 హెక్టార్లు మాత్రమే అయింది.
గడప ముందు ‘కరువు’ ముప్పు
ప్రస్తుత అనావృష్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే, వేసిన అరకొర పంటలు కళ్లముందే ఎండిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని, వర్షాధార రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
వర్షాలు వస్తాయనే ఆశతో ఇప్పటికే పలువురు రైతులు అప్పోసప్పో చేసి, వడ్డీలకు తెచ్చి పలు ఆరుతడి పంటలను సాగు చేసుకున్నారు. వాన దేవుడు కరుణించకపోతే ప్రస్తుతం సాగు చేసిన పంటల కోసం పెట్టిన ఖర్చంతా నేలపాలవుతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతాంగంలో అప్పుల భయం పట్టుకుంది.


