జమ్మలమడుగు: ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని సీఎం హోదాలో అమలు చేస్తారేమోనని ఆశగా ఎదురుచూసిన గండికోట ముంపు బాధితులకు మరోసారి నిరాశే ఎదురైంది. చంద్రబాబు నోట పరిహారం మాటే కరువైంది. ఫలితంగా గండికోట ముంపువాసుల గుండెల్లో బాధ గూడు కట్టుకుంది. ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన కోసం శుక్రవారం సున్నపురాళ్లపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దీంతో పలువురు గండికోట ముంపు బాధితులు ఎన్నో ఆశలతో సభకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడేమో ఎప్పట్లాగే ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టారు. పైగా ‘మీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గండికోట ముంపువాసుల సమస్యను నాదృష్టికి తీసుకువచ్చారు. గతంలో గండికోట ముంపువాసులకు పరిహారం ఇచ్చింది నేనే’ అంటూ గొప్పలు పలికారు. ప్రస్తుతం ఇవ్వాల్సిన పరిహారంపై ఒక్క మాటైనా చెప్పలేకపోయారు. సీఎం నోట పరిహారం మాటే రాకపోవడంతో బాధితులు నిట్టూర్చారు. ఇక రాజోళి ప్రాజెక్టు ముంపువాసుల పరిహారం విషయంలోనూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత రైతులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇస్తున్న 12.5 లక్షల కంటే అదనంగా ఎకరాలకు 24 లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామి ఇచ్చారు. ఇంత వరకు హామీ నెరవేర్చలేదు. ఇప్పుడైనా తమకు పరిహారం అందుతుందని భావించిన రాజోలి రైతులకు సైతం చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపడంతో మండిపడ్డారు. సుదూర ప్రాంతాలనుంచి సభకు తరలివచ్చిన గండికోట, రాజోళి ముంపువాసులు బిక్కమొహం వేసుకుని ఇంటిబాట పట్టారు.
గండికోట ముంపు బాధితుల పరిహారం హామీని విస్మరించిన సీఎం
బాధితుల్లో గూడు కట్టుకున్న నిరాశ
ఇబ్బందులు పడ్డ జనం..
సీఎం సభకు కార్యకర్తలు, నాయకులకు, మహిళ సంఘాలను తరలించేందుకు కూటమి నాయకులు నానా అవస్థలు పడ్డారు. వివిధ ప్రాంతాల డిపోల నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను పంపించారు. దీంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క జమ్మలమడుగు డిపో పరిధి నుంచి 25 బస్సులు వివిధ ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి చంద్రబాబు సభకు తరలించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కాగా పట్టణంలోని వీధుల్లో బస్సులు ఇరుక్కు పోయాయి. ఓ బస్సు ఆటోను ఢీకొనడంతో అంబాభవాని దేవాలయం వద్ద ట్రాఫిక్ జాం అయింది.


