స్మార్ట్‌ కిచెన్‌.. కడుపులు మాడ్చెన్‌ | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిచెన్‌.. కడుపులు మాడ్చెన్‌

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

భోజనం సరఫరా ఆలస్యం

ఆకలితో అలమటించిన విద్యార్థులు

బద్వేలు అర్బన్‌ : ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌ కిచెన్‌ విధానంలో భాగంగా కేంద్రీకృత వంటశాల నుంచి వివిధ పాఠశాలలకు సరఫరా చేసే భోజనం ఆలస్యం కావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. గురువారం చాలా పాఠశాలలకు రెండు గంటల పాటు ఆలస్యంగా భోజనం అందగా శుక్రవారం కూడా కొన్ని పాఠశాలలకు గంట ఆలస్యంగా భోజనం అందింది. బద్వేలు మండల పరిధిలో 5 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 4 మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, 55 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3580 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌ కిచెన్‌ ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పంపిణీ చేసేందుకు గాను చిన్నకేశంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్‌ కిచెన్‌ నిర్మించారు. మొదటి విడతలో మండల పరిధిలోని 37 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఒక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని 930 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు మూడు రూట్లను విభజించి మూడు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం 12–15 గంటల నుండి 1 గంట లోపు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 12–30 గంటల నుండి 1–15 గంటల లోపు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే తొలిరోజు స్మార్ట్‌ కిచెన్‌లో సాంకేతిక సమస్యలు, భోజనాన్ని సరఫరా చేసే వాహన డ్రైవర్ల అవగాహనలేమితో కొన్ని పాఠశాలలకు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా భోజనం అందింది. శుక్రవారం కూడా పలు పాఠశాలలకు దాదాపు గంట ఆలస్యంగా భోజనం అందింది. అబ్బరాతివీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాల, రాజుగారివీధి, బంకపాలెం పాఠశాలలతో పాటు రామ్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో భోజనం ఆలస్యంగా అందింది. స్మార్ట్‌కిచెన్‌ నుండి పట్టణానికి దూరంగా ఉన్న రామ్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలకు రెండు గంటలకు భోజనం అందింది. భోజనం సరఫరా చేసే వాహనాల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు స్మార్ట్‌కిచెన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా మధ్యా హ్న భోజనం సరఫరా ఆలస్యమైనట్లు తెలిసింది.

రామ్‌నగర్‌ పాఠశాలకు మధ్యాహ్నం 2 గంటలు సమయంలో

భోజనం అందించేందుకు వచ్చిన వాహనం

అబ్బరాతివీధిలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో

1–45 గంటలకు భోజనం చేస్తున్న విద్యార్థులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement