బ్రహ్మంగారిమఠం: శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన పీపీఎన్ ప్రసాద్ నియామకం చెల్లదంటూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 30న పదవీవిరమణ పొందిన ఈశ్వరాచారి స్థానంలో నూతన మేనేజర్‌గా మఠాధిపతి వెంకటాద్రిస్వామి 27న పీపీఎన్ ప్రసాద్ పేరును తెలియజేస్తూ కమిషనర్‌కు ప్రతి పాదనలు పంపారు. అక్కడ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే మఠాధిపతి ఆదేశాలు ఇచ్చారని పీపీఎన్ ప్రసాద్ ఈనెల 1న బాధ్యతలు చేపట్టారు. పీపీఎన్ ప్రసాద్ ఎలా మేనేజర్‌గా వస్తాడని కొంత మంది ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఎండోమెంట్ కమిషర్ మఠాధిపతికి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం మేనేజర్ నియామకం జరిగేవరకు ఎండోమెంట్ ఏసీ ఇన్‌చార్జి మేనేజర్‌గా వ్వవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రమేయం ఉందని బి.మఠంలో చర్చించుకుంటున్నారు.
చోరీ కేసులో నిందితుడికి
జైలు శిక్ష
వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని దుకాణంలో చోరీ చేసిన సంఘటనలో మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి 6నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. గత ఏడాది నవంబర్ 17న పులివెందులకు చెందిన మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి వేంపల్లెలోని దుకాణానికి ఉన్న తాళాలు పగలకొట్టి రూ.12వేల విలువ చేసే ఎంఐ టీవీని దొంగలించాడు. అప్పట్లో కల్లూరి హరికృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ కేసు నమోదు చేశారు. ఈమేరకు మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డిని పట్టుకొని అతని వద్ద ఉన్న టీవీని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తిపై చార్జిషిట్ దాఖలు చేయగా శుక్రవారం పులివెందుల కోర్టులో జరిగిన వాదనల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి 6నెలలు జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి చంద్రశేఖర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.మధుసూదన ఆచారి, సీఐ నరసింహులు, వేంపల్లె ఎస్‌ఐ తిరుపాల్ నాయక్, సాక్షులను కోర్టులో సకాలంలో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ బాబా ఫకృద్దీన్‌లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొండాపురం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు.శుక్రవారం ఎస్‌ఐ వివరాల మేరకు కొండాపురం మండలంలోని లావనూరు గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మోటర్ పనిచేయలేదు.స్టార్టర్ వద్ద సమస్య రావడంతో ఎలక్ట్రీషియన్ పనిచేస్తుండగా మంగలి రామంజినేయులు(44) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.మృతిదేహన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వృద్ధురాలిని బెదిరించిన
వ్యక్తిపై కేసు
కడప అర్బన్: కడప పాత బస్టాండ్‌లో ఓ లాడ్జి వద్ద లక్ష్మమ్మ అనే వద్ధురాలిని రవి అనే వ్యక్తి కత్తితో బెదిరించి రూ.3 వేలు లాక్కుని వెళ్లాడు. నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన లక్ష్మమ్మ ఈనెల రెండో తేదీన తిరుపతి వెళ్లేందుకు కడపకు వచ్చింది. కడప నుంచి రాజంపేటకు వెళ్లింది. అక్కడ నుంచి బస్సు లేకపోవడంతో తిరిగి కడపకు వచ్చింది. ఆ సమయంలో రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వృద్ధురాలిని కడపకు తీసుకొచ్చి శుక్రవారం తిరుపతికి బస్సు ఎక్కించి పంపిస్తానని చెప్పాడు. కడప పాత బస్టాండ్ తీసుకురాగానే ఓ లాడ్జి వద్దకు తీసుకెళ్లి కత్తితో బెదిరించాడు. ఆమె దగ్గర రూ. 3వేలు లాక్కొని పరారైపోయాడు. ఈ సంఘటనపై వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అమర్నాథ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


