రిమ్స్‌లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

కడప అర్బన్‌: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో వైద్య సేవల కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వీరు వైద్యసేవలు పొందుతూ వేర్వేరు రోజుల్లో మృతి చెందారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

మిస్భా తండ్రి ఆత్మహత్య

పలమనేరు: గతంలో చిత్తూరు జిల్లా పలమనేరులో కాపురముంటూ పుంగనూరుకు వెళ్ళిన మిస్భా తండ్రి వజీర్‌ అహ్మద్‌(50) రెండ్రోజుల క్రితం అక్కడి కొత్తపేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 2022లో పలమనేరులో మిస్భా అనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద మృతి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక మిస్భా కుటుంబం పుంగనూరుకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోగాని మిస్భా తండ్రి సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలమనేరులో చర్చనీయాంశమైంది.

బాలికలపై అసభ్యప్రవర్తన

– నిందితుడికి జైలుశిక్ష

పులివెందుల రూరల్‌ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో పీర్ల చావిడి సమీపంలో ముగ్గురు మైనర్‌ బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో సైదర వల్లి అనే వ్యక్తికి కోర్టు జైలుశిక్ష విధించింది. 2023 జూన్‌ 20న సైదర వల్లి ముగ్గురు బాలికలతో అసభ్యకరంగా మాట్లాడి బెదిరించినట్లు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పులివెందుల అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జి షీట్‌ దాఖలు చేసి కోర్టుకు హాజరుపరచడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన అర్బన్‌ సీఐ శ్రీరామ్‌, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ అభినందించారు.

ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు

మైదుకూరు : ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. మైదుకూరులో శుక్రవారం జిల్లా స్థాయి తనిఖీ బృందం ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లో ఈ ఏడాది, గత సంవత్సరం యూరియా, డీఏపీ ఎరువుల విక్రయాల వివరాలు, గత మూడు సంవత్సరాల సగటు విక్రయాలతో పోలిక, అసాధారణ విక్రయాల పెరుగుదలను పరిశీలించారు. యూరియా అంతర్‌ జిల్లా రవాణా, ఐఎఫ్‌ఎంఎస్‌, ఏపీఏఐఎంస్‌ 2.0 యాప్‌లో నమోదైన విక్రయాల వివరాలను పరిశీలించి ధ్రువీకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement