రొంపిచెర్ల: అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలిపోతున్న చౌక దుకాణాల బియ్యాన్ని రొంపిచెర్ల పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ వేంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళాహస్తి, నగిరి ప్రాంతాలకు చెందిన రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలి పోతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుఫార్ దూది , డీఎస్పీ వెంకట నారాయణ ఇచ్చిన రహస్య సమాచారం మేరకు అనంతపురం– చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్‌లో శుక్రవారం వాహనాల తనిఖీ చేస్తుండగా శ్రీకాళాహస్తి నుంచి వచ్చిన ఒక లారీ, ఈచర్ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు బయట పడిందన్నారు. ఈ రెండు వాహనాల వెనుక పైలెట్ వాహనం.. కారును స్వాధీనం చేసుకుని అందులోని ఐదుగరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామని అన్నారు. తమ విచారణలో 32 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్కడ తక్కువగా కొనుగోలు చేసి కర్ణాటకలోని బంగారుపేటలో రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ ముఠా వెనుక నగిరికి చెందిన అమృతరాజు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. మెరువ బాలాజీ, నందిపట్ల శ్రీనివాసులు, ఎం. సతీష్, ఎస్.కే. మహమ్మద్, దశరధ రామయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.6.30 లక్షలు ఉంటుందన్నారు. అలాగే మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని రొంపిచెర్ల సివిల్ సప్లెయ్స్ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. దాడిలో కల్లూరు ఏఎస్‌ఐ సత్య నారాయణ, రొంపిచెర్ల హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రొంపిచెర్ల, కల్లూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.


