రాజంపేట : జిల్లాలో రైతులు ఇష్టారీతిన యూరియా (నత్రజని) వినియోగిస్తున్నారు. వ్యవసాయశాస్త్రవేత్తల సిఫార్సు చేస్తున్న దాని కంటే రెండురెట్లు ఎక్కువగా చల్లేస్తుండటంతో నేల నిస్సారమవుతోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్ధ్యం పడిపోతుంది. భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
ఈ ఏడాది సాగు..
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77,993 హెక్టార్లు. ఆమేరకు మూడు విడతల్లో మెట్రిక్ టన్నుల యూరియా అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్ధాయిలో అంతకు రెండితలు ఎక్కువ వాడతుండటంతో కొరత ఏర్పడుతోంది. కొందరు ప్రైవేట్ డీలర్లు ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలు చెల్లించి మరీ తెచ్చుకుంటున్నారు.
శాస్త్రవేత్తల సిఫార్సులు..
] ఎకరా పొలానికి గరిష్టంగా 36 కిలోల నత్రజని అవసరం
] అది కూడా కొంచెం కొంచెంగా మూడువిడతలుగా నాట్లు వేసే ముందు, దుబ్బు కట్టే సమయంలో వెన్ను అంకురదశలో వేయాలి ఈ లెక్క ప్రకారం 75 కిలోల యూరియా పంటకాలానికి సరిపోతుంది.
] దమ్ము సయమంలో ఎకరాకు 50కిలోల డీఏపీ విని యోగిస్తారు. అందులో 9 కిలోల నత్రజని ఉంటుంది.
] పచ్చిరొట్ట ఎరువు వినియోగించే పొలంలో 30కిలోల యూరియా వేస్తే సరిపోతుంది.
ఆర్థిక ప్రయోజనాలు..
యూరియా వాడకం తగ్గిస్తే ఆర్ధికంగా ప్రయోజనాలు పొందవచ్చు. ఒక బస్తా (45కిలోలు)పై కేంద్ర ప్రభుత్వం రూ.2వేలకుపైగా రాయితీ ఇస్తుంది. బస్తా తయారీ ఖర్చు రూ. 2,300 వరకు ఉంటే కేవలం రూ.267 మాత్రమే అమ్ముతోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక్ర దవ్యం పరంగాను సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులపై మళ్లితే ప్రభుత్వానికి మేలు జరగడమే కాకుండా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది.
ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట..
టన్ను పచ్చిరొట్ట ఎరువులో 6 కిలోల నత్రజని, 37 కిలోల భాస్వరం, 15 కిలోలపొటాష్ లభ్యమవుతుంది. ఎకరా భూమిలో వేసిన పచ్చిరొట్ట మూడు టన్నుల వరకు అందుతుంది.35 నుంచి 40 రోజుల్లో కలియదున్నితే 60 శాతం వరకు యూరియా వాడకం తగ్గించుకోవచ్చు. నేలలో నీటి నిలుపుదలకు శక్తి పెరుగుతుంది.
విచ్చలవిడిగా యూరియా
వాడకంతో నష్టాలు
చైతన్యపరుస్తున్నా పట్టించుకోని రైతులు
అవగాహన కల్పిస్తున్నాం
యూరియా వినియోగంతో అన్ని విధాలా నష్టం జరుగుతుంది. సేంద్రియ ఎరువుల వైపు అన్నదాతను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. సాధారణంగా ఎకరాకు 75 కిలోల యూరియా వాడాలి. పచ్చిరొట్ట సాగు చేసేవారు అందులో సగం వినియోగిస్తే సరిపోతుంది.
– సుబ్రమణేశ్వరరావు.
జిల్లా వ్యవసాయాధికారి, కడప


