తప్పేమి చేయలేదు..ఆ ముగ్గురు సార్లు కొట్టారు..! | - | Sakshi
Sakshi News home page

తప్పేమి చేయలేదు..ఆ ముగ్గురు సార్లు కొట్టారు..!

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

పిల్లలను కొట్టడంపై జెడ్పీ హైస్కూల్‌లో

తల్లిదండ్రుల వాగ్వాదం

చాపాడు : టాయిలెట్‌లో నాసిరకంగా ఉన్న దెబ్బతిన్న డోర్‌ పగిలిపోగా.. దాన్ని వారిద్దరే కాళ్లతో తన్ని పగులగొట్టారని ఆరోపిస్తూ ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఇద్దరు పదో తరగతి విద్యార్థులను చితకబాదిన సంఘటన గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. బాధిత వివ్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న చాపాడుకు చెందిన జయసూర్య, పల్లవోలుకు చెందిన చైతన్యలు రోజు మాదిరే పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో ఉండే మరుగుదొడ్డి వద్ద డోర్‌ పగిలిపోయి ఉంది. ఈ డోర్‌ను జయసూర్య, చైతన్యలు పగులగొట్టారని ఆరోపిస్తూ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌, మహేశ్వర్‌రెడ్డి విద్యార్థులను ముగ్గురు కలిసి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విద్యా కమిటీ వైస్‌ చైర్మన్‌తో కలిసి పాఠశాలకు వెళ్లారు. అప్పటికే ఉపాధ్యాయులందరూ ఇంటికి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌ ఓబయ్యతో తమ పిల్లలను ఎందుకు కొట్టారని వాగ్వాదానికి దిగారు. బాత్రూం డోర్‌ అప్పటికే పగిలిపోయి ఉందని, దీనిని తమ పిల్లలే పగులకొట్టారని ఎలా చెబుతారని, ఈ విషయం తమ దృష్టికి తీసుకురాకుండా విద్యార్థులను ఎలా పడితే అలా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే క్రమంలో వాగ్వాదానికి కారణమైన మరుగుదొడ్డిని పరిశీలించగా అధ్వానంగా ఉందని, అక్కడ కనీసం నీరు కూడా లేదని, అలాంటి చోటికి విద్యార్థులు ఎలా వెళతారని, విద్యార్థులను ఎందుకు కొడతారని ప్రశ్నించారు. దీనిపై రాద్దాంతం చేయొద్దని సమస్యను సర్దుబాటు చేసేందుకు ఫిజికల్‌ డైరెక్టర్‌ ఓబయ్య ప్రయత్నించగా విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. విద్యార్థులను కొట్టడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఉపాధ్యాయులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. బాఽధిత విద్యార్థులతో పాటు మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయులు కొట్టిన విషయంపై స్పందించి నిజంగానే ఆ ఇద్దరిని కొట్టారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనపై హైస్కూల్‌ హెచెం వెంకటలక్ష్మిని వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా సంప్రదించగా స్పందించలేదు.

అధ్వానంగా మరుగుదొడ్లు

స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారాయి. పాఠశాల తెరిచి కనీసం నెల రోజులు కూడా కాకముందే మరుగుదొడ్లు వాడుకునేందుకు పనికిరాని విధంగా దుర్గంధంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. వందల మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం అక్కడి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement