బ్రహ్మంగారిమఠం నూతన మేనేజర్‌గా పీపీఎన్‌ ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారిమఠం నూతన మేనేజర్‌గా పీపీఎన్‌ ప్రసాద్‌

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

బ్రహ్మంగారిమఠం: భవిషత్‌ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కు నూతన మేనేజర్‌గా మఠాధిపతి మేనమామ కుమారుడు పీపీఎన్‌ ప్రసాద్‌ ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. పాత మేనేజర్‌ ఈశ్వరాచారి నూతన మేనేజర్‌కు ఎలాంటి రికార్డులు అప్పచెప్పనట్లు తెలుస్తోంది. మఠాధిపతి నూతన మేనేజర్‌ నియామకం కోసం ఎండోమెంట్‌ అధికారులకు పీపీఎన్‌ ప్రసాద్‌ పేరును ప్రతిపాదించి పంపారు. అక్కడి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే.. మఠాధిపతి ఆదేశాల ప్రకారం మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నానని ప్రసాద్‌ చెప్పుకొంటున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రసాద్‌ నియామకంలో పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ అడ్డుతగులుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నాళ్లు ఈశ్వరాచారిని కొనసాగించేలా చూడాలని ఎమ్మెల్యే పుట్టాకు తెలిపారు. ఆయన పీపీఎన్‌ ప్రసాద్‌ కు ఇప్పుడే అవకాశం ఇవ్వొద్దు అని మఠాధిపతికి తెలిపినట్లు తెలుస్తోంది. అడ్డుతగులుతారేమో అని పీపీఎన్‌ ప్రసాద్‌ భావించి.. ఈనెల 1 ఉదయం 5 గంటలకే మఠాధిపతి ఆదేశాల మేరకు దేవస్థానంలోని కార్యాలయానికి వెళ్లి రికార్డులో మేనేజర్‌గా సంతకం చేశారు.

దోపిడీ కేసులో

ముగ్గురికి జైలు శిక్ష

తొండూరు : 2016లో జరిగిన దోపిడీ కేసులో ముగ్గురు నిందితులకు కడప అదనపు సివిల్‌ జడ్జి కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.3000 జరిమానా విధించింది. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులు వాయిదాలకు హాజరు కాకుండా.. కోర్టు వారెంట్‌ ఇచ్చినప్పుడు ఎస్‌ఐ ఘన మద్దిలేటి, కానిస్టేబుల్‌ సిద్దారెడ్డి, హోంగార్డు గోవర్ధన్‌ వారం రోజులు గస్తీ చేపట్టి వారిని కోర్టుకు హాజరుపరిచారు. 2016 ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 8.30 గంటలకు టాటా ఏస్‌ వాహనంలో ప్లాస్టిక్‌ కుర్చీలు అమ్ముకుంటూ ముద్దనూరు నుంచి పులివెందుల వెళ్తున్న వ్యక్తిని మల్లేల ఘాట్‌ సమీపంలో అడ్డగించిన దుండగులు కత్తితో బెదిరించి వాహనం, రూ.62,000 నగదు దోచుకెళ్లారు. బాధితుడు అదేరోజు రాత్రి తొండూరు పోలీస్‌ స్టేషనన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ రవిబాబు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు ఎ–1 సాతులూరి సుధాకర్‌, ఎ–3 మేసూరుగారి సురేష్‌, ఎ–4 మేసూరుగారి గోవిందులను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం వీరికి శిక్ష ఖరారు చేస్తూ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.సి. హాసిషా సుల్తానా తీర్పు ఇచ్చారు. ఎస్‌ఐ ఘన మద్దిలేటి, పులివెందుల రూరల్‌ సీఐ శాంతి లాల్‌, డీఎస్పీ మురళీ నాయక్‌లు కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. ఏఎస్‌ఐ కె.శ్రీనివాసులు, కోర్టు మానిటరింగ్‌ సెల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, ఏపీపీ బొర్రెం శ్రీనివాసులు నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement