అమరావతి అసాధ్యం.. ‘మావిగన్‌’ వైపే ప్రజలు! | - | Sakshi
Sakshi News home page

అమరావతి అసాధ్యం.. ‘మావిగన్‌’ వైపే ప్రజలు!

Jul 3 2026 1:40 AM | Updated on Jul 3 2026 1:40 AM

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు: రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అక్కడ బంగారం లాంటి మూడు పంటలు పండే రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలు సేకరించి లక్ష ఎకరాల్లో రాజధాని కడతామనడం ముమ్మాటికీ అసాధ్యమని, ఇది కేవలం టీడీపీ నేతల దోపిడీ కోసమేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల అనుసంధాన ‘మావిగన్‌’ రాజధాని నిర్మాణమే ప్రజలందరి అసలు అభిప్రాయమని స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారి, పోర్టు సౌకర్యాలు ఉన్నందున చాలా తక్కువ బడ్జెట్‌తోనే దీనిని నిర్మించవచ్చని సూచించారు. ఈ విషయంలో జగన్‌ ఎంతో ధైర్యంగా, నిజాయితీగా ‘మొగోని మాట’ మాట్లాడారని, రాయలసీమ వాసిగా తాను దీనిని స్వాగతిస్తున్నానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశంపైనే తాము ఓట్లు అడుగుతామన్నారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని, అమరావతి భూ కుంభకోణానికి మద్దతు ఇచ్చేవారంతా టీడీపీకి ఓట్లు వేసుకోవచ్చని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం పక్కనపడి ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ అమలవుతోందని, కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు గత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ప్రజలంతా వారిని తిరస్కరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయాలని, ‘జగన్‌ మాటే మా బాట’ అని రాచమల్లు పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement