కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు ఉన్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. నర్సింగరావు పేర్కొన్నారు. గురువారం పాత రిమ్స్ లోని బీసీ భవన్ లో సీఐటీయూ జిల్లా విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్పొరేట్లకు ప్రజా సంపదను స్పీడుగా దోచిపెడుతుందని విమర్శించారు. గృహ వినియోగదారులకు విద్యుత్తు యూనిట్ రూ.7 తీసుకుంటూ ఉంటే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం యూనిట్ ఒక్క రూపాయికి ఇస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడే ఆలోచన రాకుండా యాప్‌ల పేరుతో పని భారం పెంచేశారని విమర్శించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. పీఆర్‌సీ కమిటీ వేస్తామని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందని. ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ కంటే ఎక్కువగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని, కార్మికులు సజీవ దహనమయ్యారన్నారు.. వీరి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. ఈనెల 30, 31న కార్మికులకు హక్కులు, జీతాల పెంపు కోసం కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు ఉంటాయన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా బాధ్యుడు కందారపు మురళి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా జీతాల పెంపు గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 23 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్, మనోహర్, లక్ష్మీదేవి, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఎ.రామమోహన్, అంజనీ దేవి, కార్యదర్శి సత్యం, గోపి, చంద్రారెడ్డి, పాల్గొన్నారు.


