కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామ సచివాలయ కిటికీ అద్దాలు, ఫర్నిచర్‌ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారు ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలపై ఇటువంటి దాడులు జరగడం బాధాకరమని, ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసుశాఖ వెంటనే స్పందించి ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ మహబూబ్‌బీని వివరణ కోరగా తెల్లపాడు సచివాలయంలో కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటన తన దృష్టికి వచ్చిందని, గ్రామస్తులతో పోలీసులకు ఫిర్యాదు చేయిస్తామని ఆమె తెలిపారు.
సుంకు సత్రంపై దేవదాయ శాఖ డీసీ విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శివాలయం వీధిలోని సుంకు సత్రానికి చెందిన గదుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అన్యమతస్తులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు విచారణ జరిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటనకు వచ్చిన డీసీ గురువారం సాయంత్రం సుంకు సత్రం చేరుకుని రికార్డులు తనిఖీ చేశారు. అలాగే ఆ ప్రాంతంలోని గదులను పరిశీలించారు. శివాలయంలో ఫిర్యాదు దారుడు తెల్లాకుల మనోహర్‌ను విచారించి వివరాలు సేరికంచారు. అనంతరం ఆయన ఫిర్యాదుపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సుంకు సత్రం ఈఓ శ్రీధర్, డీసీకార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


