వేంపల్లె : వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో రేణుక అనాథగా మారింది. కత్తులూరు పంచాయతీ తాటిమాకులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకట లక్షుమ్మ, వెంకట శేషు మురళీకృష్ణ అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమార్తె రేణుక ఉంది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది, కుమార్తె రేణుకనుబాగా చదివించేందు కోసం తాళ్లపల్లెలోని ప్రధాన రహదారి వద్ద చిన్న బంకు పెట్టుకుని ఉదయం పూట దోసెలు, సాయంత్రం పూట బొరుగుల మిక్చర్, అప్పలాలు పెట్టుకొని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లారీ రూపంలో మ్యత్యువు వెంటాడింది. భార్యభర్తలిద్దరూ ఒకేసారి మ్యత్యువాత పడేందుకు తాళ్లపల్లె సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో రేణుక తల్లిదండ్రులిద్దరూ లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రేణుక అక్కడికి చేరుకోగా తల్లిదండ్రులు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయింది. జీవనోపాధి కోసం ఇంటి నుండి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిన విషయం తెలిసి కన్నీటి పర్యంతమైంది. భార్యభర్తల మృతితో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒంటరిగా మిగిలిన రేణుకను సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


