●ఎండార్స్‌మెంట్‌ల మాయాజాలం.. అధికారుల ‘కాకిలెక్కలు’! | - | Sakshi
Sakshi News home page

●ఎండార్స్‌మెంట్‌ల మాయాజాలం.. అధికారుల ‘కాకిలెక్కలు’!

Jul 2 2026 2:11 AM | Updated on Jul 2 2026 2:11 AM

●ఎండార్స్‌మెంట్‌ల మాయాజాలం.. అధికారుల ‘కాకిలెక్కలు’!

కడప సెవెన్‌రోడ్స్‌: ‘జీరో పెండెన్సీతో రెవెన్యూ గ్రీవెన్స్‌ ఫ్రీ విలేజెస్‌ ఏర్పాటు కావాలి.. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్‌ తెచ్చుకోవాలి..’ ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సమీక్షల్లో అధికారులకు ఇచ్చే పదునైన ఆదేశాలు. కానీ, వైఎస్సార్‌ కడప జిల్లా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలన్నీ ప్రకటనలకే పరిమితమవుతుండటంతో, సామాన్యుడి అర్జీల పరిష్కారం అంతంత మాత్రంగానే సాగుతోంది. స్థానికంగా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన బాధితులు ప్రతి సోమవారం తమ అర్జీలను చేతబట్టుకుని మైళ్ల దూరం నుండి కడప కలెక్టరేట్‌కు పరుగులు తీస్తున్నారు. ఒక్కసారి, రెండుసార్లు కాదు... పదుల సంఖ్యలో కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న వారు లేకపోలేదు.

ఫిర్యాదుల్లో అగ్రస్థానంలో ఉన్న

టాప్‌–10 ప్రభుత్వ శాఖలు:

జిల్లాలోని మొత్తం 101 ప్రభుత్వ శాఖలకు అందుతున్న పీజీఆర్‌ఎస్‌ అర్జీలను పరిశీలిస్తే అందులో రెవెన్యూ విభాగమే అపకీర్తితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సర్వే సెటిల్‌మెంట్స్‌, పోలీసు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, నీటిపారుదల, సాంఘిక సంక్షేమ గురుకులాలు, సెర్ప్‌, పాఠశాల విద్యాశాఖ, విద్యుత్‌ శాఖ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 90,036 అర్జీలు రాగా, అందులో 74,556 పరిష్కారమైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో సర్వీస్‌ లెవెల్‌ అగ్రిమెంట్‌ (SLA) గడువు దాటిపోయిన (Beyond SLA) అర్జీలు ఏకంగా 6,996 ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.70 శాతానికి పైగా భూ రంపాయణాలే!రెవెన్యూ శాఖకు వస్తున్న అర్జీల్లో 70 శాతం పైబడి భూ సంబంధమైనవే ఉన్నాయి. ముఖ్యంగా రికార్డు ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌), మ్యూటేషన్లు, వెబ్‌ల్యాండ్‌ తప్పులు, సరిహద్దు తగాదాలు, సాదా బైనామ క్లెయిమ్స్‌, నోషనల్‌ ఖాతాల మార్పు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చుక్కల భూములు, మరియు రీ సర్వే సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడం వల్లే ఒకసారి వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తూ అర్జీలు సమర్పిస్తున్నారు. మొత్తం 40,008 రెవెన్యూ అర్జీలు రాగా, 3,881 పెండింగ్‌లో ఉన్నాయి. పరిష్కరించిన వాటిలో కూడా 1,312 అర్జీలు గడువు దాటిన జాబితాలోనే ఉన్నాయి. ఇక సర్వే సెటిల్‌మెంట్స్‌కు సంబంధించి వచ్చిన 13,506 అర్జీల్లో 514 పెండింగ్‌లో ఉండగా, పరిష్కరించిన వాటిలో 1,003 అర్జీలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ పరిధిలో ఉండటం గమనార్హం.

‘రెవెన్యూ క్లినిక్‌’.. రోగాన్ని నయం చేయని ఫార్స్‌!

పీజీఆర్‌ఎస్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌ వంటివి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్‌’ పేరుతో సరికొత్త ప్రహసనాన్ని చేపట్టింది. ఈ ఏడాది జనవరి 5 నుంచి జూన్‌ 27వ తేదీ వరకు రెవెన్యూ క్లినిక్‌లలో మొత్తం 4,344 అర్జీలు వచ్చాయి. అందులో ఆక్రమణలపై 818, మ్యూటేషన్లపై 785, రీ–సర్వేపై 784, ఆర్‌ఓఆర్‌ సవరణలపై 705, 22– అ నిషేధిత జాబితాపై 251, వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై 159 అర్జీలు వచ్చాయి. వీటిలో 2,697 పరిష్కరించామని చెబుతుండగా, ఇంకా 1,647 అర్జీలు (అఖీఖీ ఇష్యూడ్‌ 1,452తో కలిపి) పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. దీనిని కప్పిపుచ్చుకోవడానికి తాజాగా ప్రారంభించిన ‘వన్‌ మంత్‌–వన్‌ విలేజ్‌–ఫోర్‌ విజిట్స్‌’ కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో మరో ప్రహసనంగానే సాగుతోంది.

‘రెవెన్యూ క్లినిక్‌’ల పేరిట సరికొత్త ప్రహసనం

వేల అర్జీలు పెండింగ్‌, కాగితాలకే

పరిమితమైన పరిష్కారాలు!

కోటలు దాటిన సీఎం మాటలు

క్షేత్రస్థాయిలో సమస్యల మూటలు

ఫిర్యాదుల్లో ‘రెవెన్యూ’దే టాప్‌ గేర్‌

70 శాతానికి పైగా భూ రంపాయణాలే

కాగితాలకే పరిమితమైన జీరో పెండెన్సీ

‘రెవెన్యూ క్లినిక్‌లు’, ‘విజిట్లు’ ఓ ప్రహసనం

మేము ఇన్ని సమస్యలు తేల్చేశామంటూ జిల్లా రెవెన్యూ అధికారులు ఘనంగా ‘కాకిలెక్కలు’ చెబుతున్నప్పటికీ, ఒక నామమాత్రపు ‘ఎండార్స్‌మెంట్‌’ బాధితుడి చేతిలో పెట్టి కంప్యూటర్‌ సిస్టమ్‌లో సమస్య పరిష్కారమైపోయినట్లు రికార్డులు మార్చేస్తున్నారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అధికారుల ఈ కాగితపు మాయాజాలం వల్లే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 9,607 అర్జీలు ‘రీ–ఓపెన్‌’ కావడం గమనార్హం. ఇప్పటికై నా రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి గట్టి చర్యలు చేపడితేనే రీ–ఓపెనింగ్‌ రేటు తగ్గుతుంది. అధికారులు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తే.. ప్రజలు ప్రతి సోమవారం అర్జీలు చేతబట్టుకుని మైళ్ల దూరం నుండి కలెక్టరేట్‌కు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదని స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement