మాయమైన స్టీల్‌పై ప్రశ్నల వర్షం ! | - | Sakshi
Sakshi News home page

మాయమైన స్టీల్‌పై ప్రశ్నల వర్షం !

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్‌ హౌసింగ్‌ ఏఈ సుబ్రమణ్యం పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. స్టీల్‌ మాయమైన కేసులో త్రీ టౌన్‌ పోలీసులు ఆయనను శనివారం కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టీల్‌ను ఎక్కడికి తరలించారనే దానిపై మూడు రోజుల పాటు పోలీసులు ఏఈని విచారించారు. తొలి రోజు ఆయన ఏమాత్రం పోలీసులకు సహకరించలేదు. ఆదివారం, సోమవారం విచారణలో కొంతమేర నోరు విప్పినట్లు తెలుస్తోంది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన రూ.1.70 కోట్ల విలువైన స్టీల్‌ కనిపించకుండా పోగా అందులో 40–50 శాతం స్టీల్‌ను విక్రయించినట్లు ఏఈ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మిగతా స్టీల్‌ ఏమైందనే దానిపై ఆయన నోరు మెదపలేదని పోలీ సులు చెబుతున్నారు. ఈ విషయమై మూడు రోజుల నుంచి తీవ్రంగా ప్రయత్నించినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం వరకు ఏఈని విచారించిన పోలీసులు మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి తద్వారా సెంట్రల్‌ జైలుకు తీసుకెళ్లనున్నారు.

మిగతా స్టీల్‌ ఏమైనట్లు ?

మూడు రోజులుగా సాగిన పోలీసు కస్టడీ విచారణలో 40–50 శాతం మేర స్టీల్‌ను విక్రయించినట్లు ఏఈ సుబ్రమణ్యం చెప్పినట్లు తెలుస్తోంది. మాయమైన స్టీల్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి రోజు చెప్పిన ఏఈ, రెండో రోజు విచారణలో కూలీలను పోలీసులు ఆయన ముందు నిలబెట్టడంతో స్టీల్‌ విక్రయించినట్లు అంగీకరించక తప్పలేదు. అయితే మిగతా స్టీల్‌ ఏమైందనే విషయంలో ఏఈ నోరు మెదపలేదు. దీంతో ఏఈ సుబ్రమణ్యంను పోలీసులు మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ డబ్బు ఏం చేశావ్‌..?

స్టీల్‌ విక్రయించిన డబ్బును ఏం చేశావని పోలీసు అధికారులు ఏఈపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రూ.1.70 కోట్ల విలువైన స్టీల్‌లో సగం మాత్రమే విక్రయించినట్లు ఆయన అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు డబ్బు గురించి ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఏమైందనే దానిపై ఏఈ నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు అంటున్నారు. కాగా సస్పెన్షన్‌ ఆర్డర్‌ అందుకున్న రెండు రోజుల తర్వాత ఏఈ సుబ్రమణ్యం హౌసింగ్‌ కార్యాలయానికి వెళ్లి పలు కీలకమైన ఫైళ్లు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ శాఖ సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏఈ సుబ్రమణ్యంను వెంటపెట్టుకొని కార్యాలయానికి వెళ్లారు. ఆయన తీసుకెళ్లిన ఫైళ్లను తిరిగి తెప్పించుకున్నట్లు సమాచారం.

స్టీల్‌ కొనుగోలు చేసిన దుకాణదారుల్లో వణుకు

రూరల్‌ హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన స్టీల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసిన దుకాణ దారుల్లో ఇపుడు వణుకు మొదలైంది. గోడౌన్‌ నుంచి మాయమైన స్టీల్‌లో ఎక్కువ భాగం ప్రొద్దుటూరులోని దుకాణాల్లోనే విక్రయించారు. కొందరు దుకాణదారు లు నేరుగా కొనుగోలు చేయగా, మరి కొందరు కాంట్రాక్టర్లు, మేసీ్త్రల ద్వారా స్టీల్‌ను కొన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన దుకాణ దారుల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు వారిని పిలిపించి విచారణ చేశారు. త్వరలో వారి నుంచి స్టీల్‌ను రికవరీ చేసే అవకాశం ఉంది. రివకరీతోనే సరిపెడతారా లేక దొంగ సొత్తు కొనుగోలు చేసినందుకు గాను కేసులు నమోదు చేస్తా రా అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వ్యాపారుల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మూడు రోజుల పాటు హౌసింగ్‌ ఏఈని విచారించిన పోలీసులు

40–50 శాతం మేర విక్రయించినట్లు ఏఈ వెల్లడి !

ముగిసిన విచారణ.. మరోసారి

కస్టడీలోకి తీసుకునే అవకాశం ?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement