రాజంపేట: రాజకీయ కక్షతోనే తనపై దుష్ప్రచారం కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, అలాంటి వాటికి భయపడేవాడిని కాదని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసుకొని తనపై ఎల్లో మీడియా అసత్య కథనాలు వండివారుస్తోందని మండిపడ్డారు. తనేంటో రాజంపేట ప్రజలకు తెలుసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో కూటమి హవా కనిపించినా.. తాను ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచానంటే అది రాజంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నారు. సేవాదృక్ఫథంతో రాజకీయాల్లో ముందుకెళుతున్నందునే అది సాధ్యమైందన్నారు. తనకు స్వగ్రామమంటే ఇష్టమని.. అందుకే తెలంగాణాలోని కోట్లు విలువచేసే శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద స్థలాన్ని అమ్ముకొని స్వగ్రామంలో స్థలాలు కొనుగోలు చేసి నిలిచిపోయానన్నారు. అలాగే దేవాలయాలు నిర్మించి, పేద జంటలకు ఉచితంగా పెళ్లిల్లు, కంటిచూపు శిబిరాలు, సీమంతాలు, నిత్యం ఆకలి అన్నవారికి ఎస్టేట్‌లో భోజనాలు పెడుతూ తన రాజకీయ జీవితంను గడుపుతున్నాన్నారు. అది చూసి ఓర్వలేక భూముల ఆక్రమణలని, పేదరైతుల భూములు కబ్జాలని అసత్య ఆరోపణలతో కథనాలు వండివారుస్తున్నారని మండిపడ్డారు. ఆ భూములు ఎక్కడికి పోవని బాధిత రైతులు ఆందోళన చెందనవసరం లేదని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధిత రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా కల్పించారు. ఆదివారం రోజున ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేద రైతులు భూములపై దౌర్జన్యంగా జేసీబీలతో ధ్వంసం చేయించారన్నా రు. దీనిపై న్యాయం కోసం పోరాడుతామన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో రాజంపేటలో ఇలాంటి సంఘటనలు జరగలేదని గుర్తుచేశారు. ప్రస్తుత అధికారపార్టీ వల్ల నష్టపోయిన బాధిత రైతులు రాఘవరెడ్డి, చంద్రారెడ్డి, శివారెడ్డి, శ్యామలు కూడా తమకు ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా సెలవ రోజున తమ భూముల్లో దౌర్జన్యకరరీతిలో పోలీసులు అడ్డుకపెట్టుకొని, రెవిన్యూ అధికారులు కంచెలు పీకేశారని వాపోయారు.
చక్రాలమడుగు కోట్లాది విలువ చేసిన కబ్జాలు కనపడవా..
రాజంపేట పట్టణ నడిబొడ్డున వున్న చక్రాలమడుగుకు సంబంధించి కోట్లాది రూపాయిలు విలువ చేసే భూ ఆక్రమణ జరుగుతుంటే అధికారగణం చోద్యం చూస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.మట్టి, ఇసుక దర్జాగా దోచుకుంటే అధికారులకు కనపడటంలేదా అని ప్రశ్నించారు. చుండువారిపల్లెలోకోట్ల విలువ చేసే భములు, అన్నమయ్య పంటకాల్వలను టీడీపీకి చెందిన వారు ఆక్రమణలు చేశారన్నా రు. సమావేశంలో రాజంపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, రాజంపేట రూరల్ కన్వీనరు దొడ్డిపల్లె భాస్కరరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి, నాయకులు దండుగోపి, సుబ్బరాజు, గొంటుమణి తదితరులు పాల్గొన్నారు.
నేనేంటో రాజంపేట వాసులకు తెలుసు
సేవాదృక్పథంతో రాజకీయంలో
ముందుకెళుతున్నాం
మీడియా సమావేశంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి


