అర్జీలపై బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలపై బాధ్యతగా వ్యవహరించాలి

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

డీఆర్వో మల్లికార్జునుడు

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజలు సమర్పించే అర్జీలపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సభా భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అర్జీలు స్వీకరించారు.

వీఆర్వో స్మశానం ఆక్రమించారు

మా గ్రామ సర్వే నెంబరు 362/1లో 0.84 సెంట్ల మెట్ట, 363/3లో 2.44 ఎకరాల పుంజి నాకు అనువంశికంగా సంక్రమించింది. సర్వే నెంబరు 360లో పూర్వం నుంచి మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. మా పొలాల్లోకి వెళ్లేందుకు ఆ స్థశాన స్థలం నుంచే ఎన్నో ఏళ్లుగా రహదారి ఉండేది. కాగా, విలేజ్‌ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న తంబు వెంకటేశ్వర్లు దౌర్జన్యంగా స్మశానాన్ని ఆక్రమించి పంట సాగు చేస్తూ మాకు రహదారి లేకుండా చేశారు. తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. మేం అనేకమార్లు అర్జీలు సమర్పించి అలసిపోయాను. పొలం అమ్ముకుని అప్పులు తీర్చుకోవాలంటే రహదారి లేని పొలాన్ని ఎవరూ కొనరు. వీఆర్వో పంట సాగు చేయకుండా ఆపి నాకు రహదారి సౌకర్యం కల్పించాలి.

– కలువాయి రత్నమ్మ, బి.కోడూరు మండలం

నా కుమారుడి మృతిపై విచారణ జరపాలి

బి.మఠం మండలం తోట్లపల్లెలోని వీరాజనంద ఆశ్రమంలో చదువుకుంటున్న నా కుమారుడు సారెడ్డి సాత్విక్‌ ఏప్రిల్‌ 6వ తేది రాత్రి 9 గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలి. రాత్రి 9.00 గంటల సమయంలో సంఘటన జరగ్గా, విద్యుత్‌ షాక్‌ వల్ల మరణించినట్లు ఆశ్రమ నిర్వాహకులు మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు మాకు సమాచారం ఇచ్చారు. నా కుమారుని మెడ, తలపై గాయాలున్నాయి. చెవినుంచి రక్తం కారినట్లు, తల వెంట్రుకలు కాలినట్లు ఉండటం గమనించాం. నా కుమారుడు ఎలా మరణించాడని ఆశ్రమ నిర్వాహకులు వీరాజనంద స్వామిని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు యుగంధర్‌, మాతాజీ, బుచ్చిబాబు పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

– సారెడ్డి వీరమ్మ,

బొట్లపాలెం,దర్శి మండలం, ఒంగోలు జిల్లా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement