సర్‌ ఎన్యుమరేషన్‌ గడువు పొడిగించండి | - | Sakshi
Sakshi News home page

సర్‌ ఎన్యుమరేషన్‌ గడువు పొడిగించండి

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్‌ ప్రక్రియ గడువు పొడిగించాలని, బీఎల్‌ఓలకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా నియమించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష, సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు కోరారు. సోమవారం డీఆర్వో మల్లికార్జునుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002 నాటి జాబితాలో చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామంలో ‘శెట్టిపల్లెశ్రీ’ఇంటి పేరున్న అందరి ఓట్లు గల్లంతయ్యాయన్నారు. చాపాడుమండలంలోనే సుమారు 36 వేల ఓట్లు కనిపించడం లేదన్నారు. సంబంధం లేని 1141 ఓట్లు నక్కలదిన్నె గ్రామంలో చేరాయన్నారు. ఇక కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఇంటితోపాటు మరో నాలుగైదు ఇళ్ల నెంబర్లు కనిపించడం లేదన్నారు. ఓటర్ల జాబితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దీంతో మ్యాపింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎన్యుమరేషన్‌ గడువు జులై 14వ తేదీతో ముగియనుందని, ఇదే పరిస్థితి కొనసాగితే అనేక మంది ఓట్లు కోల్పొయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 14వ తేది వరకు ఎన్యుమరేషన్‌ గడువు పొడిగించాలని కోరారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియపై బీఎల్‌ఓలతోపాటు ఏఈఆర్‌ఓలకు సైతం సరైన అవగాహన లేదన్నారు. వీరికి మళ్లీ శిక్షణ ఇప్పించి ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు చొప్పున బీఎల్‌ఓలను ఏర్పాటు చేయాలన్నారు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలు బీఎల్‌ఓలను తమ ఇళ్ల వద్దకే పిలిపించుకుని ఎన్యుమరేషన్‌ చేయిస్తున్నారన్నారు.దొంగ ఓట్లు ఎక్కించే ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తోందని ఆరోపించారు. ఓట్లు, డోర్‌ నెంబర్ల గల్లంతుపై అవసరమైతే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు పులి సునీల్‌కుమార్‌, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

డీఆర్వోకు వైఎస్సార్‌ సీపీ నేతల వినతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement