● రెచ్చిపోతున్న గ్యాబ్లింగ్ ముఠాలు
● రాజకీయనాయకుల అండతోనే..
● పట్టించుకోని పోలీసులు
● పేకాటకు అడ్డుకట్ట ఎప్పుడు
జూదం ఒక వ్యసనం.
ఒక్కసారి అలవాటైతే చాలు..
జనాల జేబులు గుల్లచేసే వరకు వదలదు.
ఎంతోమంది దీనికి బానిసై ఆస్తులు, పరపతిని పోగొట్టుకున్నారు. సులభమైన పద్ధతిలో డబ్బులు సంపాదించుకోవచ్చనే కారణంతో సరదాగా మొదలు పెట్టిన ఆట దివాళా తీయిస్తున్నా కొందరు మానుకోవడంలేదు.
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో పేకాట జూదం మళ్లీ జోరందుకుంటోంది. పట్టణ నడిబొడ్డునే జూద స్థావరాలు నడస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా కొందరు నిర్వాహకులు స్థావరాలు మారుస్తూ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రొద్దుటూరు వ్యాప్తంగా మొబైల్ గ్యాంబ్లింగ్ బ్యాచ్‌లు ఉండేవి. వీరు ప్రత్యేక వాహనంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడేవారు. ఇలా రోజుకో స్థావరం మారుస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చేవారు. అయితే ఇటీవల స్థానికంగానే సురక్షిత స్థావరాలను ఏర్పాటు చేసుకొని పేకాట జూదాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ నెల 17న పట్టణ శివారులోని ఈశ్వర్‌రెడ్డినగర్ బైపాస్ రోడ్డు వద్ద, ముక్తియార్ ఆయిల్‌మిల్లు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ముగ్గురిపై గతంలోనే 10 చొప్పున పేకాట కేసులున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన కరుమూరు మహేష్ అలియాస్ మట్టి మహేష్ అనే వ్యక్తి పేకాట నిర్వహణకు తగు వసతులు కల్పించి జూదగాళ్ల నుంచి మేజ్ రూపంలో డబ్బు తీసుకునేవాడు. దీంతో పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద వీరిపై కేసు నమోదు చేశారు.
రెండు రోజుల క్రితం త్రీ టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పేకాట జూదంపై దాడులు నిర్వహించారు. 9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రూ. 2.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలతో పాటు రాజుపాళెం మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన నలుగురు గ్యాంబ్లర్లు పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. ఇవి గాక రెండు రోజులకు ఒక సారి నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో జూదరులు పోలీసులకు పట్టుబడుతున్నారు. అయితే వరుసగా దాడులు, అరెస్టులు జరుగుతున్నా పేకాట స్థావరాలు తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే జూదం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్యాంబ్లింగ్ ముఠాలు స్థావరాలు మారుస్తూ పేకాట ఆడుతున్నారని తెలుస్తోంది. పోలీసులు దాడి చేసిన తర్వాత కూడా కొత్త ప్రాంతాల్లో స్థావరాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారు..? నిర్వాహకులకు సమాచారం అందిస్తున్న వారు ఎవరనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేకాట రాయుళ్లపైనే కాకుండా నిర్వాహకులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ అండతో పేకాట స్థావరాలు
ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని పేకాట దందాను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు మండలంలో పేకాట డాన్‌గా పేరొందిన ఓ వ్యక్తి, అతని బంధువు కొన్ని రోజులుగా పట్టణ శివారులో పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు, రాజుపాళెం, పెద్దముడియం సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో జూదాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి జూద స్థావరం నిర్వాహకులకు అధికార పార్టీ నేతతో సాన్నిహిత్యం ఉండటంతో యథేచ్ఛగా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో వీరు నిర్వహిస్తున్న పేకాట స్థావరం వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాంబ్లింగ్ ముఠాలపై కేసులు నమోదు చేయడంతో పాటు, మూలాలను గుర్తించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


