అమరావతిలో భూదోపిడీ | - | Sakshi
Sakshi News home page

అమరావతిలో భూదోపిడీ

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

పులివెందుల : ‘రాజధాని అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం గడువు ముగిసినప్పటికీ, చట్టవిరుద్ధంగా రైతుల భూములను లాక్కోవడమే కూటమి ప్రభుత్వ ఏకై క లక్ష్యంగా మారింది. ఈ భూదోపిడీ వాస్తవాలు నగ్నంగా బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్‌సీపీ రైతు పరిరక్షణ కమిటీ ప్రతినిధులపై కూటమి శ్రేణులు దాడులకు తెగబడ్డాయి‘ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పులివెందుల బాకరాపురంలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ రైతు కమిటీ సభ్యులపై దాడులు చేసింది కాక ‘మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు?‘ అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదన్నారు. ‘రాజధాని అమరావతికి వెళ్లేందుకు మనకు ఏమైనా పాస్‌పోర్ట్‌, వీసా కావాలా?‘ అంటూ ఆయన నిలదీశారు. అమరావతి బాధితుల పిలుపు మేరకు ఉండవల్లి సెంటర్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకుని పోలీసుల ముందే దాడులు చేయడం దారుణమన్నారు. ఆ అరాచకాలను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు, తిరిగి బాధితులైన వైఎస్సార్‌సీపీ నేతలపైనే చట్టవిరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నడుస్తోందా? లేక నారా లోకేష్‌ ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం నడుస్తోందా?‘ అంటూ విరుచుకపడ్డారు. గతంలో ‘తెలంగాణ మీ అబ్బ జాగీరా?’ అంటూ గర్జించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మరి ఇప్పుడు అమరావతిలో సాగుతున్న భూదోపిడీపై ఎందుకు మౌనంగా ఉన్నారని, ప్రస్తుతం ఇక్కడున్న అమరావతి ఎవరబ్బ జాగీరో సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. భూములు ఇవ్వని రైతులు తమ పొలాలకు వెళ్లే దారులు మూసివేయడం, 40 అడుగుల లోతు గుంతలు తవ్వి పంటలను నిలువునా ముంచేయడం లాంటి అరాచకాలను స్వయంగా కూటమి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ అరాచకాలను ఆపకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

దొంగతనంపై కేసు నమోదు

పోరుమామిళ్ల : కాంట్రాక్టు పనిలో ఇనుపకడ్డీలు, సెంట్రింగ్‌ ప్లేట్లు దొంగలించి, పోరుమామిళ్ల పట్టణం చెరుకూరి గ్రాండ్‌ సమీపంలోని ఖాళీ స్థలంలో దాచిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు.వివరాలిలా వున్నాయి. పులివెందుల మండలంలో మౌంట్‌ విస్తా ప్రైవేట్‌ కంపెనీ చేపట్టిన కల్వర్ట్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాక అక్కడ మిగిలిన 220 కేజీల 10 ఎంఎం కడ్డీలు, 240 కేజీల 12 ఎంఎవ కడ్డీలు, 1200 కేజీల 10 సెంట్రింగ్‌ ప్లేట్లను కంపెనీలో కాంట్రాక్టర్‌ వెంకటేష్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న అట్లా శ్రీనివాసరెడ్డి దొంగలించి పోరుమామిళ్లలో దాచాడని, దీనిపై విస్టా కంపెనీ అకౌంటెంట్‌ నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

నిందితుడికి జైలు శిక్ష

సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన ఏనుగుల రామ లక్షుమ్మ ఇంటిలో 2025 జూన్‌ 8వ తేదీన దొంగతనం జరిగింది. దుండగులు ఇంట్లోకి వెళ్లి బీరువా లాకర్‌ పగలగొట్టి అందులో వున్న 4 తులాల బంగారు చైను, సుమారు 2 తులాల మూడు జతల బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు సింహాద్రిపురం పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామానికి చెందిన వల్లెపు దివాకర్‌ను అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి రూ.3లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు రిమాండ్‌లో ఉండగానే అతనిపై ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువుకావడంతో సోమవారం న్యాయమూర్తి ఎం. చంద్రశేఖర్‌ రెడ్డి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.మధుసూదన ఆచారి, రూరల్‌ సీఐ శాంతిలాల్‌, సింహాద్రిపురం ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, సాక్షులను కోర్టులో సకాలంలో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్‌ ఓ. కిశోర్‌ బాబులను జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ అభినందించారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement