తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

దువ్వూరు : రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపాడు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి మండలంలోని సంజీవరెడ్డిపల్లెకు చెందిన జొన్నవరం నాగకృష్ణారెడ్డి అనే రైతు తన సమస్యను తెలపడానికి కార్యాలయానికి వచ్చాడు. నాగకృష్ణారెడ్డి మాట్లాడుతూ దువ్వూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్‌ 620/2ఏలో 16 సెంట్ల తన పట్టాభూమిని అధికారులు మిగులు భూమి కింద మార్చారు. సర్వే నంబర్‌ 633/6లో 15 సెంట్ల పట్టా భూమి సబ్‌ డివిజన్‌ అయినా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదన్నారు. సర్వే నంబర్‌ 652లో రస్తాకు సంబంధించిన సమస్య ఉందన్నారు. ఈ సమస్యలపై గతంలో 10 సార్లు తహసీల్దార్‌కు, ఆర్డీఓలకు కలెక్టరేట్‌లో అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు. రెండేళ్ల నుంచి కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన రెవెన్యూ క్లినిక్‌లో ఈ అంశంపై ఆర్డీఓకు అర్జీ ఇచ్చానన్నారు. తన సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని సోమవారం తహసీల్దార్‌ను అడగ్గా తహసీల్దార్‌ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి తనను బెదిరించే ధోరణిలో మాట్లాడారన్నారు. తన సమస్యపై స్పందించనందుకు సీసీఎల్‌ఏ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100కు ఫోన్‌ చేసి అధికారులు తన సమస్యను పరిష్కరించడం లేదని తాళాలు వేస్తున్నానని చెప్పి కార్యాలయం లోపలి నుంచి తాళాలు వేసి నిరసన తెలిపానన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ఈ సమస్యపై ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా తనను సంప్రదించకుండానే అధికారులు అర్జీలను క్లోజ్‌ చేస్తున్నారన్నారు. అధికారులు తనను విచారణకు పిలవకుండానే ఏకపక్షంగా అవతలి వారిని పిలిచి విచారణ చేసి వారికి మద్దతు తెలుపుతున్నారన్నారు.పోలీసులు వచ్చి రైతుకు నచ్చజెప్పి కార్యాలయం తాళాలు తీయించారు. రైతు నాగకృష్ణారెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించాడని తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారని, దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తహసీల్దార్‌ ఏమన్నారంటే

ఈ విషయంపై తహసీల్దార్‌ సంజీవరెడ్డిని వివరణ కోరగా ఇది వారి అన్నదమ్ముల సమస్య, ఇరుపక్షాలను పిలిచి విచారించాం. వారు రస్తా ఇస్తామని చెప్పారు, నాగకృష్ణారెడ్డి రస్తాను రిజిస్టర్‌ చేయించి ఇవ్వాలని అడుగుతున్నాడని తెలిపారు. ఈ సమస్య అన్నదమ్ముల మధ్య కాబట్టి సామరస్యంగా పరిష్కరించుకోవాలని, లేదంటే కోర్టుకు వెళ్లాలని చెప్పానని పేర్కొన్నారు.

సమస్య పరిష్కరించనందుకు నిరసన తెలిపిన రైతు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement