జమ్మలమడుగు : నియోజకవర్గంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలనే అలోచన వైఎస్ కుటుంబం నుంచే పుట్టిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 20వేల కోట్ల పెట్టుబడితో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పారిశ్రామికవేత్త అయిన గాలి జనార్థన్‌రెడ్డి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. వైఎస్సార్ మరణంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న అలోచన ఎవ్వరికి రాలేదన్నారు. అయితే వైఎస్ కుమారుడైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ఏపీ ఐఐఐసీ ఆధ్వర్యంలో కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.అందులో భాగంగా మూడువేల ఎకరాలకు పైగా భూకేటాయింపు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 75 కోట్లు ఖర్చు చేశారు. పర్యావరణ అనుమతులను పూర్తి చేశారు. 2022 ఫిబ్రవరిలో జెఎస్‌డబ్ల్యూ సజ్జన్ జిందాల్‌ను ఒప్పించి వారికి రాయితీలు కల్పించి ప్లాంట్‌ను మరోసారి ప్రారంభింపజేశారు. అయితే తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెఎస్‌డబ్ల్యూ ఎండీపైనే కేసునమోదు చేసి వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.అందులో భాగంగా కొందరు అధికారులను సైతం అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన జిందాల్ కంపెనీతోనే కూటమి నాయకులు తిరిగి జెఎస్‌డబ్ల్యూ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వచ్చారు. నాడు జగన్‌మోహన్‌రెడ్డి అలోచన వల్లే నేడు స్టీల్‌ఫ్లాంట్ వచ్చిందన్న విషయం తెలుసుకోవాలన్నారు. కానీ నేడు స్టీల్‌ప్లాంట్ తామే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018 డిసెంబర్‌లో ఎం కంబాలదిన్నె వద్ద స్టీల్‌ఫ్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దాని పరిస్థితి ఏమైందో రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు అని ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పుడు మళ్లీ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కోసం వస్తున్నారు. దీనినైన రెండేళ్లలో పూర్తి చేస్తారా అన్న విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అధికారప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ముల్లాజానీ . ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


