మైదుకూరు : మండలంలోని జాండ్లవరం వద్ద మైదుకూరు – బద్వేలు రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తల చందు (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన చందు ప్రొద్దుటూరులో ఉంటూ బేల్దారి పనులు చేస్తుంటాడు. సోమవారం ఉదయం ప్రొద్దుటూరు నుంచి బద్వేలుకు వెళుతుండగా జాండ్లవరం వీఆర్‌ఓ కాలనీ వద్ద బైక్ నుంచి కిందపడి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి వెంకటేష్ మృతి చెందగా తల్లి వెంకటసుబ్బమ్మ ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటోంది. ఇతనికి ఒక అక్క, అన్న ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్‌ఐపై వరకట్న వేధింపుల కేసు
ప్రొద్దుటూరు క్రైం : నంద్యాల జిల్లాలో ఫింగర్ ప్రింట్ ఎస్‌ఐగా పని చేస్తున్న ఇండ్ల భరత్‌కుమార్‌పై ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న సిరివెళ్ల ఇషాక్, సుజాతల కుమార్తె ప్రియాంకకు నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలంలోని గొడిగెనూరు గ్రామానికి చెందిన ఇండ్ల భరత్‌కుమార్‌తో 2025లో వివాహమైంది. భరత్‌కుమార్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు, వివాహమైనప్పటి నుంచి భార్య ప్రియాంకను అతను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు అదనపు కట్నం కోసం వేధించేవాడు. పలుమార్లు పెద్ద మనషుల ద్వారా పంచాయతీ చేసినా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణను ఆశ్రయించారు. భర్త భరత్‌కుమార్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ప్రియాంకను వేధిస్తున్నట్లు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.


