సిద్దవటం : మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో ఆదివారం సాయంత్రం గల్లంతైన జగదీష్(26) మృతదేహం సోమవారం లభ్యమైందని ఎస్‌ఐ హారిక తెలిపారు. కడప నుంచి ఆదివారం గంగాధర్, మహేంద్ర, సోమశేఖర్, వెంకటేష్, నాగేంద్రబాబు, మహేష్‌బాబు, వెంకటసుబ్బయ్య, జగదీష్ అనే యువకులు పెన్నానదిలో సరదాగా ఈత కొడుతుండగా జగదీష్ కొట్టుకునిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. జగదీష్ మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరు జిల్లా చెరువుపల్లె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఇతను గత ఏడాది నుంచి కడప భాగ్యనగర్ కాలనీలోని ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. తండ్రి గోపి ఆదివారం మధ్యాహ్నం కుమారుడు జగదీష్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, మరోసారి ఫోన్ చేస్తే వేరే అబ్బాయిలు ఫోన్ ఎత్తి మీ కుమారుడు పెన్నానదిలో కొట్టుకొని పోయాడని సమాచారం ఇచ్చారని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. మృతుని తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హారిక తెలిపారు.


