అట్లూరు : అధికారుల నిర్లక్షమో.. కూటమి ప్రభుత్వ వైఫల్యమో గానీ ఓ రైతు బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో సృష్టించి అతనికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేసిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభగిరి గ్రామానికి చెందిన దున్నూతల రామసుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. ఈయనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా, పీఎం కిసాన్, పంటనష్టం తదితర పథకాలు అందేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు అందక పోవడంతో ఆ రైతు కార్యాలయాల చుట్టూ తిరిగాడు. అయితే అన్నీ సక్రమంగా ఉన్నాయి.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు వస్తాయని కుంభగిరి సచివాలయ సిబ్బంది కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని రైతు చెప్పడంతో అసలు విషయాన్ని అధికారులు వెల్లడించారు. మీరు చనిపోయినట్లు మీ రైతు సేవాకేంద్రం వీఏఏ కంప్యూటర్లో నమోదు చేసిశారని, అందువల్ల మీకు సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకాలేదని తెలపడంతో రైతు లబోదిబో మంటున్నాడు.


