బతుకుదెరువు కోసం వెళ్లి అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వెళ్లి అనంత లోకాలకు

Jun 30 2026 2:23 AM | Updated on Jun 30 2026 2:23 AM

బద్వేలు అర్బన్‌ : ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి అకాల మరణంతో చిన్న వయస్సులో తండ్రి బాధ్యతలను భుజాన వేసుకుని తనకు ఇష్టమైన కిక్‌బాక్సింగ్‌ క్రీడను వదులుకుని కుటుంబ పోషణ కోసం కువైట్‌కు వెళ్లాడు. తల్లికి, తమ్ముడికి అండగా ఉంటూ కుటుంబ పోషణ కోసం దేశం కాని దేశంలో రేయింబవళ్లు కష్టపడేవాడు. అయితే సోమవారం కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని వెంకటయ్యనగర్‌కు చెందిన శివప్రసాద్‌, సుబ్బరత్నమ్మలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన తుమ్మిశెట్టిసురేష్‌ (28) తండ్రి ప్రోత్సాహంతో కిక్‌బాక్సింగ్‌లో రాణిస్తుండేవాడు. నాలుగేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ బాధ్యతలు భుజానకెత్తుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట కువైట్‌కు వెళ్ళి అక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి సన్నిహితుల ద్వారా బద్వేలులోని తల్లికి, తమ్ముడికి విషయం తెలిపారు. దీంతో వెంకటయ్యనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నతనంలోనే కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకుని ఏ కష్టం రాకుండా మమ్మల్ని పోషిస్తుండే నా కొడుకు మృతిచెందాడు. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.

కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో

బద్వేలు యువకుడు మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement