రూ. 1.70 కోట్ల స్టీల్ మాయం కేసులో
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్‌లోని రూ.1.70 కోట్ల విలువైన 268.71 టన్నుల ప్రభుత్వ స్టీల్ (ఇనుప కడ్డీలు) మాయం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటివరకు కేవలం ఆరోపణలకే పరిమితమై ఎలాంటి పక్కా ఆధారాలు దొరక్క తలలు పట్టుకున్న పోలీసులకు.. స్టీల్‌ను లారీలకు లోడ్ చేసిన కూలీలను గుర్తించడంతో ఈ కేసు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యంను త్రీ టౌన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించగా, మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి కస్టడీలో ఉన్న ఏఈపై దర్యాప్తు బృందాలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. రెండో రోజు విచారణలో ఏఈ కొంత మేర నోరు విప్పి, కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
14 దుకాణాలకు సరఫరా – బద్వేల్‌తో లింక్
కూలీలను అదుపులోకి తీసుకుని పోలీసులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. గోడౌన్ నుంచి మాయమైన ప్రభుత్వ స్టీల్‌ను స్థానికంగా ఉన్న 14 పెద్ద దుకాణాలకు తరలించినట్లు కూలీలు స్పష్టం చేశారు. నిందితులు ఈ ప్రభుత్వ స్టీల్‌ను మార్కెట్ ధర కంటే దాదాపు 20 నుండి 25 శాతం తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులు, దుకాణదారులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఈ స్టీల్‌ను కేవలం ప్రొద్దుటూరు దుకాణాలకే కాకుండా, జిల్లాలోని బద్వేల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రైవేట్ కాంట్రాక్ట్ పనుల వద్దకు కూడా లారీల్లో తరలించినట్లు విచారణలో తేలింది.
ముసురుతున్న అనుమానాలు –
మరిన్ని అరెస్టులు
అయితే, 268 టన్నులకు పైగా భారీ మొత్తంలో ఉన్న స్టీల్‌ను పక్కదారి పట్టించడం కేవలం ఒక్క ఏఈ సుబ్రమణ్యం వల్లే సాధ్యమా..? అనే అనుమానాలు అటు హౌసింగ్ ఉన్నతాధికారులకు, ఇటు పోలీసులకు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఇనుము తరలించాలంటే పెద్ద లారీలు, పదుల సంఖ్యలో కార్మికుల సహకారం అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో నిందితులు ఏవైనా నకిలీ పత్రాలు (ఫోర్జరీ డాక్యుమెంట్లు) సృష్టించారా? లేక స్టాక్ బుక్కులు, ఇష్యూ రిజిస్టర్లలో తప్పుడు ఎంట్రీలు రాశారా? అనే కోణంలో పోలీసులు రికార్డులను జల్లెడ పడుతున్నారు. ఈ కుంభకోణం వెనుక పలువురు స్థానిక కాంట్రాక్టర్లు, మేసీ్త్రల పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు.ఇందులో భాగంగా బద్వేల్‌కు చెందిన ఒక కీలక వ్యక్తిని, ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన ఒక మేసీ్త్రని పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. స్టీల్ ఎక్కడికెక్కడకి తరలిపోయిందనే అంశంపై పూర్తి క్లారిటీ రావడంతో ఇన్నాళ్లూ ఉత్కంఠగా ఉన్న పోలీసు అధికారులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. కూలీలు, మేసీ్త్రల నుంచి సేకరించిన పక్కా ఆధారాలను ముందుంచడంతో ఏఈ కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ దోపిడీకి సహకరించిన అసలు సూత్రధారులను, చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారులను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
కూలీల గుర్తింపుతో దొరికిన
పక్కా ఆధారాలు
14 దుకాణాలకు ప్రభుత్వ స్టీల్ తరలింపు
ప్రొద్దుటూరుతో పాటు బద్వేల్‌లోని కాంట్రాక్ట్ పనుల వద్దకు రవాణా
మార్కెట్ ధర కంటే 25 శాతం తక్కువకే విక్రయం
నంగనూరుపల్లె మేసీ్త్ర, బద్వేల్ వ్యక్తిపై విచారణ
రెండో రోజు నోరు విప్పిన
ఏఈ సుబ్రమణ్యం


