జిల్లా వ్యాప్తంగా రహదారులు రక్తసిక్తం అయ్యాయి. ఆదివారం వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు దుర్మరణం చెందారు. అయిన వారికి విషాదం మిగిల్చారు.
మొహర్రం వేడుకలకు వెళుతూ..
ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయరహదారిలో మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రిప్పర్ ఢీకొని శివకృష్ణారెడ్డి(29)అనే యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన శివకృష్ణారెడ్డి మొహర్రం వేడుకలకు పెనికలపాడునుంచి ఓబుళాపురంలోని అత్తగారింటికి బైక్‌పై వెళుతున్నాడు. ఓబుళాపురం సమీపంలోకి రాగానే అదేమార్గంలో ప్రయాణిస్తున్న ట్రిప్పర్ ఢీకొంది.ఈ ప్రమాదంలో శివకృష్ణారెడ్డి తలకు తీవ్రగాయమైంది.దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని సీఐ పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆటోను కారు ఢీకొని..
రాజంపేట: మండల పరిధిలోని హోలీ ద్వారకా నగర్ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడి పండ్ల ఆటోను ఢీ కొట్టిన కారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సలీం. మన్నూరు పోలీసుల వివరాల మేరకు..రాజంపేట మండలం, పోలీ గ్రామంలోని అంగడి కాలనీకి చెందిన షేక్ ఉస్మాన్ తన (ఏపీ 02 పి 4969 నంబర్) టాటా ఇండిగో కారులో పోలీ హరిజన వాడ వైపు వెలుతుండగా పోలీ ద్వారకా నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మామిడి పండ్ల ఆటోను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మామిడి పండ్ల ఆటో డ్రైవర్ షేక్ సలీం కు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బద్వేల్ కు చెందిన వాడని, రాజంపేటలోని మాలిక్ ఫ్రూట్స్ యజమాని దగ్గర డ్రైవర్ గా కూలికి పనిచేస్తున్నాడని పోలీసులు నిర్థారించారు. షేక్ సలీం మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం 108లో రాజంపేట ప్రభుత్వకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తి చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు.
టిప్పర్ ఢీకొని..
జమ్మలమడుగు: మండల పరిధిలోని ఉప్పలపాడు– పెద్దముడియం మండలం గుల్లకుంట మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొడితిప్పనిపాడు గ్రామానికి చెందిన బి.మౌలాలి(40) అక్కడిక్కడే మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం బీటీ పాడు గ్రామానికి చెందిన బి. మౌలాలి పనినిమిత్తం బైక్‌లో జమ్మలమడుగుకు బయలుదేరాడు. గుల్లకుంట–ఉప్పలపాడు మార్గ మధ్యలో టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పెద్దముడియం ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం


