అన్నదాతలపై దాడి అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలపై దాడి అప్రజాస్వామికం

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

ప్రొద్దుటూరు: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అన్నదాతలపై టీడీపీ అల్లరి మూకలు దౌర్జన్యంగా దాడి చేయడం అత్యంత అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇంత దుర్మార్గంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు బతికి బట్టకడుతుందా అనేది అనుమానంగా ఉందంటూ ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా పేదలకు ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని, అలాంటిది రెండు లక్షల కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడుతుందంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.

సీఎం ఉసిగొల్పి దాడులు చేయించారు

రాజధాని కోసం తాము భూములు ఇవ్వలేమని రైతులు గతంలోనే స్పష్టం చేశారని, ఈ విషయాన్ని అప్పట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారని రాచమల్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ పరిధిలోని రైతుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నదాతలకు అండగా నిలిచేందుకు, వారి పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్లగా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ తమ క్యాడర్‌ను ఉసిగొల్పి దాడులు చేయించారని ఆరోపించారు. రైతుల అంగీకారం లేకుండా పంట పొలాల్లో బలవంతంగా రోడ్లు నిర్మించడం, మట్టిని అక్రమంగా తరలిస్తూ, దురుద్దేశంతో పంటలపైకి నీటిని వదులుతూ రైతులను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రైవేట్‌ సైన్యంలా పోలీసులు..

యెల్లో మీడియా వంత

రాజధాని నగరంలో పట్టపగలే వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేస్తూ, కారు అద్దాలను పగలగొడుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారని, చివరకు ఈ గొడవల్లో ఒక కానిస్టేబుల్‌ గాయపడినా పోలీసు స్పందించకపోవడం చూస్తుంటే.. ప్రస్తుత పోలీసు వ్యవస్థ చంద్రబాబు ప్రైవేట్‌ సైన్యంలా పనిచేస్తోందని అర్థమవుతోందని విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులైన వైఎస్సార్‌సీపీ నేతలపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవడం అన్యాయమన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని రాచమల్లు మండిపడ్డారు. దాడులు వైఎస్సార్‌సీపీ నేతలపై జరిగితే.. అవి టీడీపీ నేతలపై జరిగినట్లుగా చిత్రికరిస్తూ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పచ్చ పత్రికల్లో అబద్ధాలు రాయడం.. ఆ తర్వాత దానిని పట్టుకుని టీడీపీ నేతలు టీవీ డిబేట్లలో కూర్చోవడం ఒక అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంతగా బెదిరింపులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ నష్టపోతున్న అన్నదాతల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని రాచమల్లు తేల్చిచెప్పారు.

కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ కోసమే

బలవంతపు భూసేకరణ, దౌర్జన్యాలు

ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో తప్పుడు ప్రచారం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement