కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న రఘుపతి (45) అనారోగ్యంతో మృతి చెందినట్లు కడప రిమ్స్ పీఎస్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు అన్నమయ్య జిల్లా తంతివారి పల్లి గ్రామానికి చెందిన రఘుపతి (45) హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి 2008లో కడప సెంట్రల్ జైలుకు వచ్చాడు. గత కొంత కాలంగా తీవ్ర అనాఆరోగ్యంతో బాధపడుతుండేవాడని, చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.
చక్రాయపేట: మండలంలోని అద్దాలమర్రి (ఆంజనేయపురం) క్రాస్ సమీపంలో నామాల గుండు వద్ద పాపాఘ్ని నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆర్కే వ్యాలీ ఎస్‌ఐ శ్రీప్రియ తెలిపారు.మృతుడి వయసు ఉమారు 40 సంవత్సరాలు ఉంటందని చెప్పారు.మూడు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. మృతదేహం కదపడానికి కూడా వీలు లేక పోవడంతో పంచనామా నిర్వహించి సంఘటన స్థలం వద్దనే వేంపల్లె ప్రభుత్వ వైదులతో పోస్టుమార్టం చేయించి నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆదారంగా కేసుకమోదు చేస్తామని ఆమె వివరించారు.ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి,చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రైలు కింద పడి..
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం రాత్రి ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎర్రగుంట్ల రైల్వే ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతుడికి సంబంఽధించిన వివరాలు తెలియలేదన్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎర్రగుంట్ల రైల్వేపోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
గోపవరం : బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చెర్లోబోయినపల్లె, చెర్లోరామాపురం గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పీర్లపండుగ సందర్భంగా శనివారం రాత్రి చెర్లోబోయినపల్లెలో నిర్వహించిన కోలాటం వద్ద జరిగిన వివాదంలో చెర్లోరామాపురానికి చెందిన యువకుడిని చెర్లోబోయినపల్లె గ్రామానికి చెందిన వారు కొట్టడంతో మొదలైన వివాదం చిన్నపాటి గొడవకు దారితీసింది. ఆదివారం చెర్లోబోయినపల్లెకు చెందిన వారు చెర్లోరామాపురం నుంచి వెళుతుండగా శనివారం రాత్రి జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని వారిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. చెర్లోబోయినపల్లెకు చెందిన 9 మంది, చెర్లోరామాపురానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడినవారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఘర్షణకు దిగిన రెండు గ్రామాలకు చెందిన వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రాజీకి పడేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై బద్వేలు రూరల్ ఎస్‌ఐ రంగారావును వివరణ కోరగా ఘర్షణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.


