● 47 ఎకరాలలో ప్రభుత్వ భూమి బోర్డుల ఏర్పాటు
● వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు
రాజంపేట రూరల్: గత 40 సంవత్సరాల నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు సాగు చేసుకుంటున్న 47 ఎకరాల భూమి చుట్టూ ఉన్న కంచెను తహసీల్దార్ దస్తగిరయ్య తన సిబ్బందితో పాటు పదుల సంఖ్యలో పోలీసు బలగంతో వెళ్లి జేసీబీలతో ఆదివారం తొలగించారు. ఈ ఘటన మండల పరిధిలోని శ్రీరంగరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి గ్రామం అంటేనే మింగుడు పడని విధంగా ఇటీవల రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పనులు వివాదస్పదంగా మారుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న చక్రాల మడుగు వద్ద సెంటు రూ.20లక్షలు విలువైన స్థలాన్ని టీడీపీ నాయకులు యథేచ్చగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా స్పందించని రెవెన్యూ శాఖ ఇప్పుడు కళ్లు తెరుచుకుందా అనే అనుమానం రాజంపేట వాసుల్లో కలుగుతోంది. నూతనంగా నిర్మిస్తున్న హైవేకు కిలోమీటరు దూరంలోని చుండువారిపల్లెలో ఎకరా కోటి రూపాయల విలువైన భూమి కబ్జా చేసినట్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు రైతులు సాగు చేసుకొనే భూమిలో సూచికలు ఏర్పాటు చేయటం విడ్డూరంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
సూచికలు ఏర్పాటు చేసిన సర్వే నంబర్లు... 150–1లో 4.39, 150–3లో 4.00, 151–1లో 5.00, 151–2లో 4.67, 152–1లో 5.39, 37లో 9.50, 142లో 1.01, 143లో 3.74, 149–3లో 2.00, 1302–3లో 0.44, 1302–5లో 0.08, 1301–1లో 2.27. 1299–1లో 1.90, 1300–1లో 2.83 ఉన్నాయి. తహఽసీల్దార్ దస్తగిరయ్యను ఈ సర్వే నంబర్లు ఎవరి పేరుతో ఉన్నాయి, రైతులు ఎంత మంది అని అడగ్గా తెలియదు అని సమాధానం ఇచ్చారు.
కూటమి నాయకుల అక్కసు..
వైఎస్సార్ కుటుంబానికి వీరవిధేయునిగా ఉంటూ నిత్యం అన్నదానాలు చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కసు వెళ్లగక్కుతోందనేది బహిరంగ రహస్యం. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు, ఆకేపాటి సానుభూతి పరులు అంటే కూటమి నాయకులు విషం కక్కటం నియోజకవర్గంలో సంచలనంగా మారుతుంది.


