జమ్మలమడుగు : అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం స్థలాలు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు... ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపిచామని అధికారులు సమాధానమిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అధికార పార్టీకి చెందిన మాజీ గ్రామ ప్రజాప్రతినిధి రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే అధికారులు కనిపించడం లేదు. అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణం వేగంగా సాగుతోంది. గతంలో సామాన్యులు గండికోటలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్, చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తుంటే అధికారులు పోలీసులతో వాటిని తొలగింపజేశారు. ఇప్పుడు మాత్రం ఉదాశీనవైఖరి అవలంభిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం
అధికార పార్టీ నాయకుడి ఇష్టారాజ్యం


