డ్వాక్రా రుణం తీసుకున్నందుకు భర్త మందలించాడని.. | - | Sakshi
Sakshi News home page

డ్వాక్రా రుణం తీసుకున్నందుకు భర్త మందలించాడని..

Jun 29 2026 1:29 AM | Updated on Jun 29 2026 1:29 AM

డ్వాక్రా రుణం తీసుకున్నందుకు భర్త మందలించాడని..

కుమార్తెతో సహా ఇంటి నుంచి

వెళ్లి పోయిన భార్య

ప్రొద్దుటూరు క్రైం : తనకు తెలియకుండా డ్వాక్రా రుణం ఎందుకు తీసుకున్నావని భర్త అడిగినందుకు బిడ్డతో సహా తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన రామకృష్ణకు భార్య మాధవి, గాయత్రి అనే ఏడేళ్ల కుమార్తె ఉంది. మాధవి ఇటీవల భర్తకు తెలియకుండా డ్వాక్రాలో రుణం తీసుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఎందుకు డ్వాక్రాలో డబ్బు తీసుకున్నావని అడిగాడు. దీంతో సీకెదిన్నె మండలంలోని జమాల్‌పల్లి గ్రామంలో ఉంటున్న తన అక్కను అడిగి డబ్బు తీసుకొస్తానని ఈ నెల 17న కుమార్తెతో సహా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భర్త పలుమార్లు ఫోన్‌ చేయగా తన అక్క వద్ద ఉన్నానని, డబ్బు తీసుకొని వస్తానని చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 25న ఫోన్‌ చేయగా ఆమె మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో భర్త రామకృష్ణ జమాల్‌పల్లికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లి భార్య, కుమార్తె గురించి వాకబు చేయగా ఇక్కడికి రాలేదని చెప్పారు. దీంతో రామకృష్ణ ఆదివారం ప్రొద్దుటూరు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. అత్తారింటి వద్ద ఉన్నారనుకున్న భార్య, కుమార్తె కనిపించకపోవడంతో రామకృష్ణ ఆందోళన చెందసాగాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement