ఈ–పర్మిట్‌ వజ్రాయుధం! | - | Sakshi
Sakshi News home page

ఈ–పర్మిట్‌ వజ్రాయుధం!

Jun 29 2026 1:23 AM | Updated on Jun 29 2026 1:23 AM

సెస్సు వసూళ్లకు..

1 నుంచి మార్కెట్‌ కమిటీలు, చెక్‌పోస్టులలో కొత్త విధానం

సిబ్బంది చేతివాటానికి బ్రేక్‌.. పర్మిట్‌ లేని వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై నిషేధం

కడప అగ్రికల్చర్‌ : జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో ఇకపై పాత మేన్యువల్‌ (చేతిరాత) పద్ధతులకు పూర్తిగా కాలం చెల్లనుంది. మార్కెట్‌ సెస్సు వసూళ్లు, తనిఖీ కేంద్రాల వద్ద పర్మిట్ల జారీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త డిజిటల్‌ సంస్కరణలకు తెరలేపింది. రాబోయే జూలై 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ ‘ఈ–ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.

జిల్లాలో మార్కెట్‌ కమిటీల పరిస్థితి – రూ.15.33 కోట్ల లక్ష్యం

జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, బద్వేల్‌, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, మైదుకూరు, కమలాపురం, సిద్ధవటం, ఎర్రగుంట్ల, సింహాద్రిపురంలో మొత్తం 11 మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 సరిహద్దు చెక్‌పోస్టులు విస్తరించి ఉన్నా యి. ప్రధానంగా కడప యార్డులో పసుపు, వేరుశనగ క్రయవిక్రయాలు భారీగా సాగుతుండగా, మిగిలిన చోట్ల అరటి, బొప్పాయి, మామిడికాయల విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) ఈ 11 మార్కెట్‌ కమిటీలకు సంబంధించి మొత్తం రూ.15.33 కోట్ల మార్కెట్‌ సెస్సు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోగా, మే చివరి నాటికి రూ.315.57 లక్షలు (రూ.3.15 కోట్లు) వసూలయ్యింది.

చేతివాటానికి చెక్‌..

క్యూఆర్‌ కోడ్‌తో పక్కా నిఘా

ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత మ్యాన్యువల్‌ విధానం వల్లే కొన్ని చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీనిని అరికట్టేందుకే ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఈ–పర్మిట్‌ విధానాన్ని తెచ్చారు. కొత్త విధానం ప్రకారం.. వ్యాపారులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాక ఒక ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ పర్మిట్‌ వస్తుంది. రవాణా వాహనాలు చెక్‌పోస్టుల వద్దకు రాగానే, అక్కడి సిబ్బంది ఆ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే వాహనంలో ఉన్న లోడ్‌, చెల్లించిన రుసుము వంటి సమగ్ర వివరాలన్నీ కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం సిబ్బందికి ఉండదు.

301 మంది వ్యాపారులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 11 మార్కెట్‌ కమిటీల పరిధిలో మొత్తం 301 మంది లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు ఉన్నారు. వీరందరూ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ను పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆన్‌లైన్‌ పర్మిట్‌ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తే, వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి రవాణాను పూర్తిగా నిషేధించనున్నారు. ఈ డిజిటల్‌ విధానం వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంతో పాటు వ్యాపారులకు, రైతులకు చెక్‌పోస్టుల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

లైసెన్స్‌ లేకుంటే జరిమానా వడ్డింపు

జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఆన్‌లైన్‌ ‘ఈ–పర్మిట్‌’ విధానంలో వ్యాపారులకు ట్రేడ్‌ లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి ఈ–ట్రాన్స్‌పోర్ట్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని వ్యక్తిగత లాగిన్‌, పాస్‌వర్డ్‌లను పొందాల్సి ఉంటుంది. వీటి ద్వారానే ఆన్‌లైన్‌లో రవాణా పర్మిట్‌ జారీ చేస్తారు. బ్యాంకుల ద్వారా సెస్‌ (రుసుము) చెల్లించడానికి 15 రోజుల గడువు ఉంటుంది. ఈ లోపు డబ్బులు చెల్లించకపోతే ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలిచిపోతుంది. చెక్‌పోస్టుల వద్ద ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా పంట దిగుబడులను తరలించే వారిని ‘నాన్‌–ట్రేడర్స్‌’ కింద పరిగణించి సెస్‌ వసూలు చేస్తారు. అయితే, లైసెన్స్‌ లేకుండా రవాణా చేయడానికి కేవలం మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ లోగా సదరు వ్యాపారి చేత లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయిస్తారు. మూడుసార్లు దాటిన తర్వాత కూడా లైసెన్స్‌ లేకుండా సరుకు రవాణా చేస్తూ పట్టుబడితే.. సరుకు మొత్తం విలువను బట్టి అధికారులు భారీగా జరిమానా వసూలు చేస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement