కడప రూరల్ : జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులు 2,37,527 మంది లక్ష్యం కాగా.. సాయంత్రం 7 గంటల సమయానికి 2,21,552 మందికి వైద్య సిబ్బంది చుక్కల మందును వేశారు. ఆ మేరకు లక్ష్య సాధనలో 93.27 శాతం నమోదైంది.
కాగా నేడు, రేపు ఇంటింటికీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ పర్యవేక్షించారు. ఈయన కడప నగరం ఫక్కీరుపల్లె పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య భవిత కోసం పెద్దలు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పని సరిగా చుక్కల మందును వేయాలన్నారు. లక్ష్య సాధనలో 100 శాతం కార్యక్రమంను విజయవంతం చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమీషనర్ రాకేష్‌చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా టీకాల అధికారి డాక్టర్ ప్రవీణ్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


