●రాజకీయాలు పక్కనబెట్టి.. అందుబాటులోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

●రాజకీయాలు పక్కనబెట్టి.. అందుబాటులోకి తేవాలి

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

●రాజకీయాలు పక్కనబెట్టి.. అందుబాటులోకి తేవాలి

పులివెందుల టౌన్‌: పులివెందుల ప్రాంత యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా గండికొడుతోంది. స్థానిక రింగ్‌రోడ్డు హెలీప్యాడ్‌ సమీపంలోని 14 ఎకరాల విశాల విస్తీర్ణంలో, సుమారు రూ.23 కోట్ల భారీ వ్యయంతో అడ్వాన్స్‌డ్‌ క్రికెట్‌ స్టేడియం నిర్మాణాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సహకారంతో, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పనులు గత ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా సాగి ఏకంగా 80 శాతం వరకు పూర్తయ్యాయి.

కళ్లెదుటే ప్రగతి.. కానీ కూటమి పాలకుల నిర్లక్ష్యం

గత ప్రభుత్వ హయాంలో స్టేడియం చుట్టూ భద్రత కోసం నిర్మించిన భారీ కాంపౌండ్‌ వాల్‌, అంతర్గత సీసీ రోడ్లు, అత్యాధునిక వసతులతో కూడిన రెండు భారీ బిల్డింగ్‌లు, సిటౌట్లు, ప్రధాన గ్యాలరీతో పాటు రెండు అత్యాధునిక క్రీడా మైదానాల పనులు 80 శాతం పూర్తయ్యాయి. స్థానిక క్రీడాకారులు మెట్రో నగరాలకు వెళ్లే పనిలేకుండా ఇక్కడే ప్రపంచస్థాయి శిక్షణ పొందేలా సర్వాంగ సుందరంగా ఈ మైదానాన్ని తీర్చిదిద్దారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పులివెందుల అభివృద్ధిపై కక్షసాధింపు చర్యలకు తెరలేపింది. పగ ప్రతీకార రాజకీయాలతో పనులను అర్ధంతరంగా నిలిపివేయడంతో, ఈ అంతర్జాతీయ స్టేడియానికి ‘చంద్ర’గ్రహణం పట్టినట్లయింది. కూటమి నాయకులెవరూ ఈ స్టేడియం వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానిక యువత వాపోతోంది.

తరలిపోయిన సామగ్రి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా !

ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో క్రికెట్‌ స్టేడియం తీవ్రంగా భ్రష్టుపట్టిపోతోంది. పాలకుల ఒత్తిడితో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు సైతం ఇక్కడున్న విలువైన క్రీడా సామగ్రిని రహస్యంగా వేరే ప్రాంతాలకు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణ, రక్షణ కరువవడంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో పెంచిన మైదానంలోని గడ్డి ఇప్పుడు పశువులకు మేతగా మారుతోంది. రాత్రి వేళల్లో సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు ఇది నిలయంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొరగా మిగిలిపోయిన కేవలం 20 శాతం పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే క్రికెట్‌ స్టేడియం పరిసరాలు దెబ్బతినకుండా ఉంటాయని క్రీడాకారులు కోరుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చుట్టూ ఉన్న కాంపౌండ్‌ వాల్‌కు గేటు ఏర్పాటు చేసి, పక్కాగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కూటమి నాయకులు రాజకీయాలను పక్కనబెట్టి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి స్టేడియాన్ని ప్రారంభించాలని క్రీడాకారులు, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement