● నలుగురిని బలిగొన్న ప్రమాదాలు ● ఆరుగురికి చూపునిచ్చిన అమరత్వం
కడప అర్బన్: ఆ కుటుంబాల్లో గుండెకోత మిగిలింది.. కన్నబిడ్డలు అనంతలోకాలకు వెళ్తుంటే ఆ తల్లిదండ్రుల కళ్లు కన్నీటి సముద్రాలయ్యాయి. కానీ, ఆ మహా దుఃఖంలోనూ వారు చూపిన మానవత్వం.. ఆరుగురు అంధుల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపింది. 24 గంటల వ్యవధిలో కడప నగరంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
వరుస ప్రమాదాలు
చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసరామయ్యగారిపల్లి క్రాస్ రోడ్ వద్ద శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ సంస్థ (ఎయిల్ డిక్సన్ సీసీ కెమెరాల కంపెనీ) ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు వేగంగా వచ్చి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పేర్ల శివ (56) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రాత్రి కడప నగర శివార్లలోని పాలంపల్లె క్రాస్ వద్ద జరిగిన మరో ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. చెట్టంత యువకులు కళ్లముందే శవాలుగా మారడంతో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.
గుండె కోతలోనూ గొప్ప మనసు
పాలంపల్లె ప్రమాదంలో మరణించిన యువకులలో బండి జయకిషోర్, హర్షవర్ధన్ అనే ఇద్దరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కడుపుకోతను దిగమింగుకుని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డలు ఇక లేకపోయినా.. వారి కళ్లు ఈ లోకాన్ని చూడాలనే సంకల్పంతో నేత్రదానానికి ముందుకు వచ్చారు. మృతుల కుటుంబీకులు చూపిన ఈ అసాధారణ మానవత్వానికి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది తక్షణమే స్పందించి నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాల ద్వారా ఆరుగురు అంధులకు చూపు రానుంది. కన్నబిడ్డల మరణ శోకంలోనూ సమాజం పట్ల బాధ్యతను చాటుకున్న ఆ తల్లిదండ్రుల నిర్ణయాన్ని కడప నగర ప్రజలు కన్నీళ్లతో అభినందిస్తున్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొన్న ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ మేనేజర్ రెడ్డి బాబు, సిబ్బంది బాధిత కుటుంబాలకు ఇన్‌స్టిట్యూట్ తరఫున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు.


