లింగాల : చిన్నారి హత్యపై ఆగ్రహం వెల్లువెత్తింది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన తీవ్రం చేశారు. బాధిత కుటుంబానికి మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, సంఘీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారితో పోలీస్ అధికారులు చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం సాయంత్రం నిత్విక అనే నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసి 200 లీటర్ల నీటి డ్రమ్ములో పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో నిత్విక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్ మధురెడ్డి గ్రామానికి వెళ్లి నిత్విక మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు రామాచారి, సృజనతో ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో మాట్లాడుతూ రామాచారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రామాచారి కుటుంబానికి తగిన భరోసా కల్పిస్తారన్నారు. అదే విధంగా ఆయన సీఐ శాంతిలాల్‌తో చర్చలు జరిపి, రామాచారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులు గ్రామ మహిళలతో కలిసి రామాచారి ఇంటి బయట బైటాయించి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని రామాచారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.
ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిని సస్పెండ్ చేయాలి
ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్‌ఐ లోపట్నూతల గ్రామానికి వచ్చే వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని రామాచారి కుటుంబం గ్రామంలో ఒంటరిగా ఉందని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ మీడియాతో మాట్లాడుతూ బాలికను హత్య చేసిన స్వాతి, ఆమె భర్తకు ఉరి శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గతంలో బైండోవర్ కేసులు ఉల్లంఘించినందున వారికి రూ.25 లక్షల దాకా జరిమానా విధించాలన్నారు. అలాగే వెంకట్రామిరెడ్డి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబానికి వత్తాసు పలికిన ఎస్‌ఐపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీఐ శాంతిలాల్ మీడియాతో మాట్లాడుతూ రామాచారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తమతోపాటు న్యాయ స్థానంలో సాక్షులు కూడా బలంగా నిలబడితే స్వాతి, వెంకట్రామిరెడ్డిలకు కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. పోలీసులు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులకు, గ్రామస్తులకు, రామాచారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి నిత్విక మృతదేహానికి ఖననం చేసేందుకు అంగీకరింపజేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిత్విక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, పులివెందుల మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, గ్రామ నాయకులు వెంగల్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, వివిధ గ్రామాల వైఎస్సార్‌సీపీ నాయకులు, సీఐలు ప్రసాదరావు, శ్రీరామ్, భాస్కర్‌రెడ్డి, లింగాల పోలీసులు సిబ్బంది, ప్రత్యేక పోలీసు సిబ్బంది పాల్నొన్నారు.
రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బైఠాయింపు
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులతో చర్చించిన పోలీసులు
నిత్విక మృతదేహానికి నివాళులర్పించిన వైఎస్ మధురెడ్డి
నిత్విక హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
పులివెందుల రూరల్ : చిన్నారి నిత్విక హత్య కేసులో నిందితురాలు స్వాతిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళి విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ తీసుకుని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆధారాలను బట్టి చిన్నారి హత్య కేసును 24 గంటల్లోపే ఛేదించి నిందితురాలిని అరెస్టు చేశామన్నారు. శనివారం 11 గంటల ప్రాంతంలో నిందితురాలు స్వాతి పులివెందుల రూరల్ సర్కిల్ కార్యాలయ సమీపంలో సంచరిస్తుండగా.. రూరల్ సీఐ శాంతి లాల్, లింగాల ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డిలు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. సుమారు 8 నెలల క్రితం సృజన పిల్లలు.. స్వాతి పిల్లలు చిన్న విషయం మీద గొడవపడ్డారని, ఇరు వర్గాల వారు తిట్టుకునేవారన్నారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని స్వాతి అనే మహిళ నిత్వికను హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్వాతిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీరామ్, నరసింహులు, శంకర్‌రెడ్డి, ప్రసాద్ రావు, ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


