తల్లులకు కడుపుకోత మిగిల్చిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తల్లులకు కడుపుకోత మిగిల్చిన ప్రమాదం

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

కడప అర్బన్‌/వల్లూరు (చెన్నూరు) : కడప నగర శివారులో చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాలంపల్లె క్రాస్‌ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మూడు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు తల్లులకు కడపుకోత మిగిల్చింది. ఈసంఘటనపై పోలీసుల, మృతుల కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.

తిరుపతి జిల్లా తిరుపతి నగరం అరుణోదయనగర్‌కు చెందిన కోటకొండ హర్షవర్ధన్‌ (22) బీటెక్‌ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బండి జయకిషోర్‌ (18) అనే యువకుడి తండ్రి అంజి కూలీపని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవలే మృతి చెందాడు. జయకిశోర్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు. తిరుపతిజిల్లా అనంతరాజుపేట గ్రామం తూర్పుపల్లెకు చెందిన డి. రవీంద్రారెడ్డి కుమారుడు దేసు సాయి శ్రీధర్‌రెడ్డి (28) గత ఏడాది అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి ఇండియాకు వచ్చాడు. తన తండ్రికి కొన్ని నెలల కిందట బైపాస్‌ సర్జరీ జరిగింది. ఇక ఇక్కడే వుండి వ్యవసాయం చూసుకోవాలనీ అనుకున్నాడు. వీరు ముగ్గురు తమ స్విప్ట్‌ కారులో రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో తమ స్నేహితుడి నిశ్చితార్థం ఉంటే వెళ్లారు. తిరిగి శుక్రవారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. కడప నగర శివార్లలోకి వచ్చేసరికే ఈ ప్రమాదం చోటచేసుకుంది. కడప రిమ్స్‌ మార్చురీలో మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. హర్షవర్ధన్‌ తండ్రి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూరు సీఐ చాంద్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

యువకుల్లారా.. వేగంగా వెళ్లకండి

రోడ్డు ప్రమాదం కేవలం అతివేగం నిర్లక్ష్యం వల్లనే చోటుచేసుకుందని ప్రాథమికంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్లి తిరిగి వస్తున్న స్విప్ట్‌కారు పాలెంపల్లె క్రాస్‌ వద్దకు రాగానే ఎదురుగా వెళుతున్న లారీని వేగంగా వెళ్లి ఓవర్‌టేక్‌ చేశారు. ఎదురుగా తిరుపతి వైపు నుంచి వస్తున్న ఎర్టిగా కారును స్విఫ్ట్‌కారు వారు ఢీకొన్నారు. దీంతో స్విఫ్ట్‌కారు ఎగిరిపడి లారీని వెనక్కి ఢీకొని నుజ్జునుజ్జయింది. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఎర్టిగా కారుకు సంబంధించిన బెలూన్‌లు ఓపెన్‌ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కార్తీక్‌(24) మున్నా (23) నాగరాజు (38) గాయాలతో బయటపడ్డారు. వీరిని మొదట కడప రిమ్స్‌కు, తర్వాత కర్నూలుకు తరలించారు. ఎర్టిగా కారు వారు తిరుపతికి చెందిన వారు. ఎంబ్రాయిడరీ పనులకు సంబంధించిన సంస్థ కార్తీక్‌ది కావడంతో మిగిలిన ఇద్దరితో కలిసి మెటిరియల్‌ను సరఫరా చేసేందుకు కర్నూలు, హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ముగ్గురు యువకుల తల్లులు రోదనతో తమ ఆవేదనను తెలియజేశారు. ఎవరైనా సరే ప్రధానంగా 20 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువకులు బైక్‌ల్లోగానీ, కార్లలోగానీ మితిమీరిన వేగంతో, వెళ్లరాదన్నారు. మా ముగ్గురి కుటుంబాలలో విధించిన కడుపుకోత మరే కుటుంబాలలో ఉండకూడదని పేర్కొన్నారు.

కోటకొండ హర్షవర్ధన్‌ (ఫైల్‌)

దేసు సాయి శ్రీధర్‌ రెడ్డి (ఫైల్‌)

బండి జయకిషోర్‌ (ఫైల్‌)

రెండు కార్లు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement