చింతకొమ్మదిన్నె : మండలంలోని పెద్దకాంపల్లి గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి ఇంట్లో విషద్రావణం తాగింది. వెంటనే ఆమెను రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.ఆయన కథనం మేరకు.. నూర్జహాన్‌కు ఆరేళ్ల క్రితం పెద్దకాంపల్లె కు చెందిన షేక్ కమాల్‌బాషాతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. భర్త జీవనోపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామ పైన వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలిది పాతకడప సమీపంలోని మోడమీదిపల్లి. మృతురాలి తల్లి షేక్ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాల మద్దిలేటి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.చింతకొమ్మదిన్నె మండల తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు.
జీవితంపై విరక్తితో..
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతిపేటకు చెందిన చెన్నం లక్షుమ్మ (54) అనే మహిళ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సరస్వతి పేటకు చెందిన మహిళలు 7 నెలల కిందట పొలం పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా గ్రామానికి సమీపంలో ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా లక్షుమ్మతోపాటు మరో ఏడుగురు మహిళా కూలీలు గాయపడ్డారు. లక్షుమ్మ కుడి కాలి పాదం పైభాగం నుజ్జునుజ్జు అయింది. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించకున్నా బాగుపడక ఇబ్బంది పడేది. తన రోజువారి పనులు చేసుకునేందుకు కూడా కష్టంగా ఉండటంతో జీవితంపై విరక్తి చెంది పంటల కోసం ఆమె భర్త ఇంటిలో తెచ్చి ఉంచిన పురుగుల మందును గురువారం తాగింది. మైదుకూరులో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. మృతురాలి భర్త దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రైతు రక్షణ వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరిగే ఏపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు. శనివారం కడపలో రాష్ట్ర మహాసభలకు సంబధించిన పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రమాదకర కేంద్ర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా,భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఏటా 5 లక్షల కోట్ల రూపాయలు సంపద అమెరికాకు తరలిపోతుందని చెప్పారు. ఈ సభలకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ వంటి జాతీయ రైతు నేతలు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు కుమారస్వామి రెడ్డి, చిన్న సిద్దయ్య ,హరి, సుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


